
హైవేపై తప్పిన పెను ప్రమాదం
ఎర్రవల్లి: జాతీయ రహదారిపై ఆదివారం ప్రయాణిస్తున్న భారీ కంటైనర్‌లోని మిషనరీ కారుపై పడింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు, ఎస్‌ఐ వెంకటేశ్ వివరాల మేరకు.. కర్నూలు జిల్లాలోని కోవెలకుంట్లకు చెందిన పుస్యహాసారెడ్డి తన కారులో ముగ్గురు కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌కు బయల్దేరారు. మార్గమధ్యంలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై పదో బెటాలియన్ సమీపంలో ముందుగా వెళ్తున్న కారు సడెన్ బ్రేక్ వేయడంతో దానికి స్వల్పంగా వెనకనుండి ఢీకొట్టారు. ఈ క్రమంలో రెండు కార్ల యజమానులు వాహనాలను రోడ్డు పక్కన ఆపి గొడవ పడుతుండగా.. అదే దారి గుండా వెళ్తున్న ఓ భారీ కంటైనర్‌ను నిలువరించేందుకు ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో బెల్ట్ తెగిపోయి దానిపై ఉన్న మిషనరీ కారుపై పడింది. ఈ ప్రమాదంలో కారులోని నలుగురు వ్యక్తులు ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డారు. అయితే హైవేపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఇరువైపులా 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు, హైవే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
కారుపై పడిన కంటైనర్‌లోని మిషనరీ
భారీగా నిలిచిన వాహనాలు

హైవేపై తప్పిన పెను ప్రమాదం