
ఆదివాసీ చెంచులకు వరం
అచ్చంపేట/మన్ననూర్: ఇందిరా సౌరగిరి జలవికాసం పథకం ఆదివాసీ చెంచులకు వరంలాంటిదని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో సీఎం పర్యటన ఏర్పాట్లను ఆదివారం ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ, కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాండ్ వైభవ్ రఘునాథ్‌లతో కలిసి మంత్రి పరిశీలించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. దశాబ్ధాలుగా నిరాధారణకు గురైన ఆదివాసీ చెంచులకు రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు. పోడు భూముల్లో ఎకరాకు రూ. 6లక్షల నుంచి రూ. 8లక్షల వరకు ఖర్చుచేసి ఉద్యాన తోటలను అభివృద్ధి చేసి ఇస్తుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2లక్షల మంది ఆదివాసీ రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ.. గిరిజన రైతుల కోసం ప్రవేశపెడుతున్న కొత్త పథకాన్ని నల్లమల ప్రాంతంలో ప్రారంభించడం శుభపరిణామమన్నారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగా లేనప్పటికీ చెంచుల అభ్యున్నతి కోసం బృహత్తర పథకానికి శ్రీకారం చుడుతున్నట్లు వివరించారు. సీఎం సభకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఇన్‌చార్జి అధికారి, డీఎఫ్‌ఓ రోహిత్‌రెడ్డి, అదనపు కలెక్టర్ దేవ సహాయం, డీపీఓ రామ్మోహన్, డీటీడీఓ ఫిరంగి, ఆర్డీఓ మాధవి, జిల్లా ఉద్యానశాఖ అధికారులు జగన్, వెంకటేశ్, రాజేందర్, మల్లేష్, వెంకటయ్య తాహసీల్దార్ శైలేంద్ర, ఎంపీడీఓలు వెంకటయ్య, జగదీశ్ పాల్గొన్నారు.