
తల్లి మందలించిందని బాలుడి ఆత్మహత్య
హన్వాడ: క్షణికావేశం.. కన్నవారి ప్రేమానురాగాన్ని మరిపించింది. జీవితం అంటే ఇంతేనా అనే రీతిలో ఓ బాలుడు ఆత్మహత్య చేసుకుని తల్లిదండ్రులకు తీరని గర్భశోకాన్ని మిగిల్చాడు. హన్వాడ మండలం టంకరలో ఆదివారం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా.. టంకరకు చెందిన మెండె పెద్దరాములు – గౌరమ్మలకు ఇద్దరు సంతానం. కుమారుడు మల్లేష్ (13) నారాయణపేటలోని గురుకుల పాఠశాలలో 8వ తరగతి పూర్తిచేసుకొని సెలవుల్లో స్వగ్రామానికి వచ్చాడు. కూతురు స్వగ్రామంలోని పాఠశాలలో 5వ తరగతి చదువుతుంది. అయితే వేసవి సెలవుల్లో ఇంటి పట్టున ఉంటున్న మల్లేష్ బయటి వ్యక్తులు, ఇతరులతో కలివిడిగా కలిసిపోకపోగా.. ఎవరితోనూ మాట కలపకుండా స్తబ్దుగా ఉండేవాడు. ఇంట్లో కేవలం టీవీ, మొబైల్ ఫోన్ చూస్తూ ఉండే వాడు. ఈ క్రమంలో తల్లిదండ్రులు కుమారుడి శైలిపై పలుమార్లు ప్రశ్నించినా ఫలితం లేకపోయింది. ఆదివారం గౌరమ్మ పొలం వద్ద చిన్నపని ఉంది.. వెళ్లొద్దామని కోరగా అయిష్టంగానే వచ్చి, మళ్లీ ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉన్న ఒక్కగానొక్క కొడుకుని బాగా చదివించి ప్రయోజకుడిని చేద్దామనుకున్న ఆ తల్లిదండ్రుల కలలు కళలైపోయాయి. కొడుకు మృతదేహాన్ని చూసి గుండెలు బాదుకుంటూ రోదించారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా, ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.