
కుక్కల దాడిలో చిన్నారికి గాయాలు
వనపర్తిటౌన్: కుక్కల దాడిలో మూడేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడింది. వనపర్తి జిల్లా కేంద్రంలోని రాయిగడ్డ కాలనీలో తోటి చిన్నారులతో కలిసి డింపుల్ అనే చిన్నారి ఆడుకుంటుండగా.. వీధి కుక్కలు ఒక్కసారిగా దాడికి యత్నించాయి. గమనించిన స్థానికులు కుక్కలను తరిమేస్తున్న క్రమంలో ఓ కుక్క డింపుల్‌పై దాడి చేయడంతో ముఖం, చేతిపై గాయాలయ్యాయి. స్థానిక మాజీ కౌన్సిలర్ లక్ష్మీనారాయణ సహకారంతో చిన్నారిని చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ కుక్కకాటుకు సంబంధించిన మందులు అందుబాటులో లేవని వైద్యులు చెప్పడంతో.. స్థానికంగా ఉన్న ప్రైవే టు ఆస్పత్రిలో చికిత్స చేయించినట్లు చిన్నారి తల్లిదండ్రులు ప్రకాశ్, స్రవంతి తెలిపారు.
పట్టించుకోని మున్సిపాలిటీ..
జిల్లా కేంద్రంలో కొన్ని రోజులుగా కుక్కల బెడద ఎక్కువైందని మున్సిపల్ కమిషనర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌కు విన్నవించినా పట్టించుకోవడం లేదని మాజీ కౌన్సిలర్ లక్ష్మీనారాయణ అన్నారు. వీధి కుక్కలను ఎనిమల్ కేర్‌కు తరలించి తగిన చర్యలు చేపడతామని పుర అధికారుల మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయాయని, కుక్కల నివారణకు యంత్రాంగం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.