
హత్య కేసులో నిందితుడి అరెస్టు
నాగర్‌కర్నూల్ క్రైం: అత్యాచారం చేసి మహిళను హత్య చేసిన ఘటనలో నిందితుడిని అరెస్టు చేసినట్లు నాగర్‌కర్నూల్ సీఐ కనకయ్య గౌడ్ తెలిపారు. ఈనెల 11న కుమ్మెర శివారులో జరిగిన మహిళ హత్య కేసుకి సంబంధించి శుక్రవారం సీఐ వివరాలు వెల్లడించారు. బిజినేపల్లి మండలం వసంతాపూర్‌కి చెందిన రాములమ్మ(44) తన భర్త మృతి చెందడంతో ఒంటరిగానే జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలోనే లింగసానిపల్లి గ్రామానికి చెందిన పరశురాములు తన స్నేహితుడి ద్వారా రాములమ్మను పరిచయం చేసుకుని ఫోన్ చేసి ఆమెతో మాట్లాడాడు. ఈనెల 11న బైక్‌పై కుమ్మెర శివారులోని వ్యవసాయ పొలం వద్దకు రాములమ్మను తీసుకువెళ్లి అత్యాచారం చేయడంతో పాటు హత్యకు పాల్పడ్డాడు. నిందితుడు రాములమ్మ వద్ద ఉన్న తులం బంగారు ఆభరణాలను, మూడు తులాల వెండి ఆభరణాలను తీసుకొని వెళ్లిపోయాడు. కుమ్మెర శివారులో వ్యవసాయ పొలం వద్ద కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మహిళ మృతదేహాన్ని ఈనెల 14న గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందింది. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనరల్ ఆస్పత్రి మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా మృతురాలి సెల్‌ఫోన్ డేటాను తీసుకొని విచారణ జరిపిన పోలీసులు నిందితుడి ఫోన్ నంబర్‌పై అనుమానంతో శనివారం లింగసానిపల్లి గ్రామానికి వెళ్లి పరశురాములును అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో మహిళను అత్యాచారం చేసి హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు సీఐ వెల్లడించారు. నిందితుడు నుంచి బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. సమావేశంలో ఎస్సై గోవర్ధన్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.