
ఎక్కడి పనులు అక్కడే..
● నిలిచిన 167వ నంబరు జాతీయరహదారి విస్తరణ పనులు
● కొలిక్కిరాని మహనీయుల విగ్రహాల తరలింపు
● దుమ్ము, ధూళితో ప్రయాణికులకుఇబ్బందులు
జడ్చర్ల టౌన్: పట్టణంలోని ప్రధాన చౌరస్తా సిగ్నల్‌గడ్డ వద్ద 167వ నంబరు జాతీయ రహదారి విస్తరణ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ముఖ్యంగా పనులకు ఆటంకంగా మారిన మహనీయుల విగ్రహాల తరలింపు కొలిక్కి రాకపోవటమే సమస్యగా మారింది. దీంతో కాంట్రాక్టర్ అసహనం వ్యక్తం చేస్తుండగా.. ప్రయాణికులు దుమ్ము, ధూళితో ఇబ్బందులు పడుతున్నారు. సిగ్నల్‌గడ్డ వద్ద డా.అంబేడ్కర్, మహాత్యాజ్యోతిరావు పూలే, జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ విగ్రహాలు తొలగించాల్సి ఉంది. అయితే వీటిని మళ్లీ ఎక్కడ ప్రతిష్ఠించాలనే విషయంపై స్పష్టత లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇందుకోసం మూడుసార్లు సమావేశాలు జరిగినప్పటికీ ఏకాభిప్రాయం కుదరడం లేదు.
కంకర వేసి..
లయన్స్‌క్లబ్ వద్ద రోడ్డు తవ్వి కంకర వేసి వదిలేశారు. పట్టణంలోకి వెళ్లే వైపు సగం తవ్వి సగం మెటల్ వేశారు. అంబేడ్కర్, పూలే చౌరస్తాలో పరిస్థితి మరీ అద్వాన్నంగా ఉంది. పూలే విగ్రహం అలాగే ఉంచి మట్టి, తహసీల్దార్ కార్యాలయం ఎదుట కంకర పర్చి వదిలేశారు. ఆరాధ్య మార్ట్ వైపు సగం తవ్వి విడిచిపెట్టారు. ఇలా ఉన్న కొద్దిపాటి ప్రాంతంలోనే పనులు వదిలి వేయటంతో రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణదారులు, వాహనదారులు, పట్టణంలోకి వచ్చి వెళ్లేవారు తీవ్ర అవస్థలు పడుతున్నారు. విగ్రహాలు తొలగిస్తేనే పనులు ముందుకు సాగుతాయని కాంట్రాక్టర్ జాతీయ రహదారుల శాఖ అధికారులకు తెలియజేశారు. ప్రస్తుతం మెయింటెనెన్స్ వాల్ నిర్మాణం మాత్రమే జరుగుతుంది. ఇది పూర్తయ్యాక పనులు పూర్తిగా నిలిచిపోయే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇదే జరిగితే విస్తరణ పనులకు పూర్తిగా బ్రేక్ పడినట్లవుతుంది. ఇప్పటికే మూడేళ్లుగా ఇబ్బందులు పడుతున్న ప్రజలు మరింతకాలం సమస్యతో సతమతమవ్వాల్సిన దుస్థితి ఏర్పడనుంది. ఈ విషయమైన ఏం చేయాలో తెలియక జాతీయ రహదారుల శాఖ అధికారులు అయోమయానికి గురవుతున్నారు.
విగ్రహాల తరలింపు సంగతేమిటో..
రోడ్డు విస్తరణ పనులు ముగిసిన తర్వాత ఆ విగ్రహాలను అక్కడే ప్రతిష్ఠించాలని కులసంఘాలు పట్టుబడుతున్నాయి. అందుకు జాతీయ రహదారుల శాఖ ససేమిరా అంటుండటంతోనే ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. మహబూబ్‌నగర్, కొడంగల్ పట్టణాల్లో జాతీయ రహదారి సర్కిల్స్‌లోనే డా.అంబేడ్కర్ విగ్రహం ఉండటాన్ని కొందరు ప్రస్తావిస్తున్నారు. అక్కడ లేని నిబంధనలు ఇక్కడెందుకు అంటూ నిలదీస్తున్నారు.
స్పందించని ఎమ్మెల్యే, ఎంపీ
విగ్రహాల తరలింపు, పునఃప్రతిష్ఠపై ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి, ఎంపీ డీకే అరుణ స్పందించాల్సిన సమయం వచ్చింది. ఇప్పటికే పనులు ఆలస్యం కావటం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారు జోక్యం చేసుకుని అందరి ఆమోదం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

ఎక్కడి పనులు అక్కడే..