
తపాలా సేవలు.. ప్రజలకు తప్పని ఇక్కట్లు
వనపర్తిటౌన్: ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి పాలమూరు జిల్లాను ఐదు జిల్లాలుగా విభజించింది. ప్రతి జిల్లాలో కలెక్టరేట్ పరిధి ఆ జిల్లా వరకే పరిమితమై ఉంటుంది. కానీ తపాలా శాఖ అందుకు భిన్నంగా ఉండటంతో ప్రజలకు రవాణ కష్టాలు, వ్యయప్రయాసలు తప్పడం లేదు. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని ఐఏఎస్ క్యాడర్ అధికారులతో జిల్లా కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు ఉన్నా తపాలా శాఖ మాత్రం యధాతథంగానే కొనసాగుతుంది. వనపర్తి తపాలా ప్రధాన కార్యాలయం పరిధి నాలుగు జిల్లాల్లో విస్తరించి హైదరాబాద్ చేరువ వరకు సేవలందిస్తోంది. నాలుగు జిల్లాలకు వనపర్తి కేంద్ర కార్యాలయంగా సేవలు అందిస్తోంది. వనపర్తి జిల్లాతో పాటుగా నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలోని 20 మండలాలతో పాటు మిగతా నాలుగు జిల్లాలకు వనపర్తి కేంద్రంగా తపాలా సేవలు అందుతున్నాయి. జిల్లాల పునర్విభజన కంటే ముందు ప్రతి జిల్లాలో రెండు ప్రధాన తపాలా కార్యాలయాలను ఏర్పాటు చేఽశారు. అందులో భాగంగానే అప్పట్లో ఒకటి వనపర్తిలో ఉంటే, మరొకటి మహబూబ్‌నగర్‌లో ఉండేది. ఈ రెండు కార్యాలయాల ద్వారానే అవిభక్త మహబూబ్‌నగర్ జిల్లా అంతటా రంగారెడ్డి ప్రాంతంలోని పలు ప్రాంతాల దాకా తపాల శాఖ తన సేవలను అందించేది.
పరిధి 200 కిలోమీటర్లు
వనపర్తి జిల్లా పరిధి 30 కిలోమీటర్ల లోపు ఉంటే తపాలా పరిధి సుమారు 200 కిలోమీటర్ల వరకు ఉంది. శ్రీశైలం డ్యాం చివరి డెడ్‌లైన్ వరకు చేవేళ్ల దాకా ఉంది. ఈ తపాలా పరిధిలో సేవింగ్, ఆర్డీ, ఎస్‌ఎస్‌ఏ, ఎంఐఎస్, పీపీఎఫ్ ఇలా తదితర ఖాతాలు కలిపి 371,107 మంది వినియోగదారులు ఉన్నారు. ఇందుకు గాను 398 బ్రాంచి పోస్టాఫీసులు, 38 సబ్ పోస్టాఫీస్‌లో కలిపి సుమారుగా 600 మంది విధులు నిర్వర్తిస్తున్నారు.
మా పరిధి నాలుగు జిల్లాలే..
వనపర్తి జిల్లాతో పాటుగా వనపర్తి తపాలా కార్యాలయం మిగతా మూడు జిల్లాలోనూ సేవలు అందిస్తోంది. జడ్చర్లలోని ఏఎస్పీ, సబ్ డివిజనల్ ఆఫీసర్‌లు వారి సమీపంలోని కార్యాలయాలను పర్యవేక్షిస్తారు. నేను మా పరిధిలోని కార్యాలయాలంటినీ తరచుగా విజిట్ చేసి వినియోగదారులకు మెరుగైన సేవలందిస్తున్నాం. కార్యాలయాల పరిధిని కుదిస్తే ప్రజలకు సత్వర సేవలు అందించవచ్చు.
– భూమన్న, వనపర్తి తపాలా అధికారి
2016 నుంచి మారిన సీన్
2016 అక్టోబర్ 11వ తేదీన కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి సమీకృత కలెక్టరేట్ కార్యాలయాలతో కొలువుదీరిన సంగతి తెలిసిందే. అయితే తపాలా కార్యాలయం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో విభజించిన జిల్లాలకు అనుగుణంగా తపాలా కార్యాలయం పరిధిని మార్చలేదు. ఫలితంగా తపాలా కార్యాలయం పరిధి అలాగే కొనసాగుతుంది. విభజించిన జిల్లాలకు కలెక్టర్‌లను కేటాయిస్తున్నప్పుడు తపాలాను జిల్లాకు అనుగుణంగా విభజించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థించాల్సి ఉంది. ఆ దిశగా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు. జిల్లాలు ఏర్పాటు అయినప్పటి నుంచి ఇదే పరిస్థితి నెలకొనడంతో తపాలా ప్రధాన కార్యాలయాల పరిధిలో మార్పు కనిపించలేదు. ఇంతకు ముందు రెండు ప్రధాన తపాలా కార్యాలయాల పరిధిలో ఒక జిల్లా కలెక్టర్ ఉంటే ప్రస్తుతం నాలుగు జిల్లాల కలెక్టర్‌ల పరిధిలో వనపర్తి ప్రధాన తపాలా కార్యాలయం కొనసాగుతుండటం గమనార్హం. వనపర్తిలో విధులు నిర్వర్తించే ప్రధాన పోస్టల్ సూపరిండెంట్‌కు ఏ జిల్లాలో కలెక్టర్ మీటింగ్ పెడితే అక్కడకు పరుగెత్తాల్సి వస్తోంది. ఈ క్రమంలో అధికారులు ఆయా జిల్లాల కలెక్టర్‌లు మారినప్పుడు మర్యాద పూర్వకంగా కలిసేందుకు, సమీక్షలకు హాజరయ్యేందుకు అన్ని జిల్లాలకు వెళ్లాల్సిందే. ఒకవేళ తపాలా ఉన్నతాధికారుల విజిట్ వల్ల హాజరు కాకపోతే మరుసటి రోజు వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోంది.
తప్పని భారం
వనపర్తి తపాలా పరిధి నాలుగు జిల్లాలలో ఉండటంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. దీనికి తోడు ఆయా జిల్లాల పరిధిలో ప్రత్యేక పరిస్థితుల వల్ల అధికారుల్లోనూ ఒత్తిడి నెలకొంది. ఏదైనా తీరని సమస్యను పరిష్కరించుకునేందుకు ఇన్సూరెన్స్ క్లెయి మ్స్ విషయంలో తేడాలు ఇలా ఏ సమస్య ఎదురైన ప్రజలు వనపర్తి ప్రధాన కార్యాలయానికి రావడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో అధికారులు అందుబాటులో ఉండటకపోవడం, మరుసటి రోజు వరకు నిరీక్షణ చేయాల్సి వస్తుంది. రంగారెడ్డి, అమ్రాబాద్, బాల్‌నగర్‌లతో పాటుగా ఇతర జిల్లాలలోని మండలాల ప్రజలు వనపర్తికి వచ్చేందుకు జంకుతున్నారు. ప్రస్తుత జిల్లాలకు అనుగుణంగా తపాలా శాఖ సేవలను విస్తరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
నాలుగు కలెక్టరేట్‌ల పరిధిలోకి వనపర్తి తపాలా కార్యాలయం
జిల్లాలు ఏర్పడి తొమ్మిదేళ్లు కావొస్తున్న పరిస్థితిలో రాని మార్పు
ప్రభుత్వం అభ్యర్థిస్తేనే మిగతా జిల్లాలకు ప్రయోజనం

తపాలా సేవలు.. ప్రజలకు తప్పని ఇక్కట్లు