
వెల్దండ: తల్లి ఒడిలో హాయిగా నిద్రిస్తున్న ఓ చిన్నారి ప్రమాదవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదంలో అనంత లోకాలకు వెళ్లిపోయింది. ప్రమాదంలో తల్లిదండ్రులు సైతం తీవ్రంగా గాయపడిన విషాదకర సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని కొట్రగేట్ సమీపంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్‌ఐ కురుమూర్తి కథనం ప్రకారం.. తెలకపల్లి మండలం నెల్లికుదురు గ్రామానికి చెందిన కోమల సాయి హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో నివాసం ఉంటూ కారు క్యాబ్ డ్రైవర్ జీవనం సాగిస్తున్నారు. అయితే లింగాల మండలం అంబటిపల్లిలో బంధువుల వివాహం ఉండటంతో కారులో సాయితోపాటు భార్య శిరిష, వీరి కూతురు తేజశ్రీ (8నెలలు)తో కలిసి మంగళవారం రాత్రి బయలుదేరారు. ఈ క్రమంలో వెల్దండ సమీపంలోని వీజేఆర్ హోటల్ వద్ద కల్వకుర్తి వైపు ఇనుప సీకులు (చువ్వలు)తో వెళ్తున్న డీసీఎం ఎలాంటి సిగ్నల్ లేకుండా రోడ్డుపై నిలిపాడు. వెనుక నుంచి వచ్చిన కారు డీసీఎంను ఢీకొట్టడంతో అందులోని ఇనుప సీకులు చిన్నారి తలలోకి గుచ్చుకోవడంతో అక్కడికక్కడే మృతిచెందింది. అలాగే భార్యాభర్తలు శిరీష, సాయి చాతీ భాగంలోకి ఇనుప చువ్వలు దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లారు. గమనించిన స్థానికులు వెంటనే వారిని సమీపంలోని యెన్నమ్స్ ఆస్పత్రికి.. అక్కడి నుంచి మెరుగైన వైద్య కోసం హైదరాబాద్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయమై పూర్తి విచారణ చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.
కారు, డీసీఎం ఢీ.. ఇనుప సీకులు గుచ్చుకొని చిన్నారి మృతి
తల్లిదండ్రుల పరిస్థితి విషమం