
పంట కాల్వలను పరిశీలించిన అధికారులు
అయిజ: పంట కాల్వలతో పొలం మునిగిపోతుందని, సంబంధిత అధికారులు సమస్యను పరిష్కరించడం లేదని రైతు అనంతరెడ్డి గతంలో లోకాయుక్తను ఆశ్రయించారు. విచారణ చేపట్టేందుకు మంగళవారం లోకాయుక్త దర్యాప్తు అధికారి మాథ్యూ కోశీ, నెట్టెంపాడు ప్రాజెక్ట్ ఎస్‌ఈ రహముద్దీన్ తూంకుంటకు చేరుకున్నారు. నెట్టెంపాడు ప్రాజెక్ట్‌లో భాగంగా గ్రామ సమీపంలో నిర్మించిన 106 ప్యాకేజీ కాల్వలను పరిశీలించారు. బాధితుడితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. చుట్టుపక్కల పొలాల రైతులను విచారించారు. పంట పొలాల్లో ఏర్పాటు చేసిన ఫీటు కాల్వలను రైతులు పూడ్చివేయడంతో సమస్య ఏర్పడిందని.. బాధితుడు తమ పొలంలోని కాల్వకు ఇరువైపులా ఉన్న కట్టలను చదును చేయడంతో సమస్య మరింత జఠిలమైందని నిర్ధారణకు వచ్చారు. మైనర్ కాల్వను ముందుకు కొనసాగించి సమస్య పరిష్కరిస్తామని తెలిపారు. ఇందుకు రైతులు సంతకాలు చేసి నెట్టెంపాడు ప్రాజెక్ట్ అధికారులకు ఇవ్వాలని ఎస్‌ఈ రహముద్దీన్ సూచించారు. విచారణ అంశాలను లోకాయుక్తకు అందజేస్తానని దర్యాప్తు అధికారి మాథ్యూ కోశీ పేర్కొన్నారు.