
పీయూ కంట్రోలర్‌గా ప్రవీణ
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ నూతన కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్‌గా డా.ప్రవీణను నియమిస్తూ వైస్ చాన్స్‌లర్ శ్రీనివాస్ సోమవారం నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆమె ఎగ్జామినేషన్ భవనంలో బాధ్యతలు స్వీకరించారు. గతంలో అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్‌గా, పీయూ ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్‌గా ప్రవీణ బాధ్యతలు నిర్వహించారు. ఇక్కడ కంట్రోలర్‌గా పనిచేసిన రాజ్‌కుమార్ ఇటీవల బాధ్యతల నుంచి తప్పుకోవడంతో ఆమెను నియమిస్తూ వీసీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు అధ్యాపకులు, అధికారులు అభినందనలు తెలిపారు.
కొనసాగుతున్న ఐసీ పరీక్షలు..
పీయూ పరిధిలో ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ సెమిస్టర్ 8కు సంబంధించిన పరీక్షలు కొనసాగుతున్నాయి. పీయూలో ఒక పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయగా.. 60మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్ష కేంద్రాన్ని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రవీణ, అడిషనల్ కంట్రోలర్ శాంతిప్రియ, ప్రిన్సిపాల్ మధుసూదన్‌రెడ్డి తనిఖీ చేశారు.
15 నుంచి డిగ్రీ పరీక్షలు..
పీయూ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీఎస్‌డబ్ల్యూ తదితర గ్రూప్స్ విద్యార్థులకు ఈ నెల 15 నుంచి సెమిస్టర్–2, 4, 6 పరీక్షలు నిర్వహించనున్నట్లు పీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రవీణ సర్క్యూలర్ జారీ చేశారు. ఇందుకు సంబంధించిన టైం టేబుల్ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు.
శ్రీశైలంలో నీటిమట్టం 814.1 అడుగులు
దోమలపెంట: శ్రీశైలం జలాశయం నీటిమట్టం సోమవారం నాటికి 814.1 అడుగుల వద్ద 36.8198 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇరవై నాలుగు గంటల వ్యవధిలో రేగుమాన్‌గడ్డ నుంచి ఎంజీకేఎల్‌ఐకు 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. శ్రీశైలం కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి జరగలేదు. కాగా శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885.0 అడుగుల వద్ద 215.807 టీఎంసీలు నీటి నిల్వలు ఉంటాయి.