
అమ్మవారికి బంగారు ఆభరణం బహూకరణ
అలంపూర్: అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన అలంపూర్ క్షేత్రంలో ఐదవ శక్తిపీఠంగా కొలువైన శ్రీజోగుళాంబ అమ్మవారికి భక్తులు ఆదివారం బంగారు కాసుల పేరును బహుకరించారు. ఏపీలోని కర్నూలుకు చెందిన శివ చరణ బ్రహ్మచారి సస్య గ్రూప్ శ్రీనివాస్ దంపతులు, కృష్ణమోహన్ దంపతులు ఈ బంగారు ఆభరణాన్ని బహుకరించినట్లు ఆలయ ఈఓ పురేందర్ కుమార్ తెలిపారు. భక్తులు సమర్పించిన బంగారు ఆభరణం 118 గ్రాముల బరువు ఉండగా విలువ రూ.11 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. అదే విధంగా ప్రసాద్ స్కీంలో భాగంగా అన్నదాన సత్రంలో భక్తుల కోసం రూ.50 వేల విలువ గల 25 స్టీల్ టేబుల్స్‌ను విరాళంగా అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా దాతలను ఆలయ అధికారులు శేషవస్త్రాలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు.