
25 ఏళ్లకు కలిసిన పేగుబంధం
దేవరకద్ర రూరల్: ఆర్థిక సమస్యలతో విసిగివేసారి కుటుంబాన్ని వదిలి వెళ్లిపోయిన ఓ వ్యక్తి.. 25 ఏళ్లకు తిరిగివచ్చిన సంఘటన ఆదివారం మండలంలోని గుడిబండలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గుడిబండకు చెందిన మన్సూర్‌అలీకి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కాగా.. వివిధ కారణాలతో కుటుంబం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. దీంతో అప్పుల బాధ పెరిగిపోయి మనస్తాపానికి గురైన మన్సూర్‌అలీ ఇంట్లో కూలీ పనులకు వెళ్తున్నానని చెప్పి వెళ్లిపోయాడు. ఎంతకూ తిరిగి రాకపోవడంతో అతని కోసం కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో మన్సూర్‌అలీ భార్యనే ఇంటి పెద్ద దిక్కుగా మారి కూలీ పనులు చేస్తూ, కుటుంబాన్ని పోషించి పిల్లల పెళ్లిళ్లు సైతం చేసింది. ఈ క్రమంలో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పనినిమిత్తం బెంగళూర్ వెళ్లగా అక్కడ వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న మన్సూర్‌అలీని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. అతడి కుమారుడు యూనిస్ బెంగుళూరు వెళ్లి తన తండ్రిని తిరిగి ఇంటికి తీసుకువచ్చాడు. ఒకానొక దశలో లేడు అనుకున్న వ్యక్తి తిరిగి ఇంటికి రావడంతో ఆ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఆర్థికంగా ఎదగలేకపోవడంతో కుటుంబానికి మొహం చూపించలేక తిరిగి రాలేకపోయినట్లు మన్సూర్‌అలీ తెలిపారు.
ఆర్థిక సమస్యలతో వెళ్లిపోయిన మన్సూర్‌అలీ
గ్రామస్తుడి సమాచారంతో తిరిగి ఇంటికి చేరిన వైనం