
నిర్లక్ష్యానికి రెండు ప్రాణాలు బలి
జడ్చర్ల: అధికారుల నిర్లక్ష్యమో.. అలసత్వమో కానీ.. విద్యుదాఘాతానికి రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. వ్యవసాయ పొలంలో విరిగిన విద్యుత్ స్తంభాన్ని మారుస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ సరఫరా జరిగి షార్ట్‌సర్క్యూట్‌తో ఓ రైతు, మరో కూలీ దుర్మరణం చెందారు. కావేరమ్మపేట శివారులో ఆదివారం చోటుచేసుకున్న ఈ విషాదకర సంఘటనకు సంబంధించి వివరాలిలా.. కావేరమ్మపేటకు చెందిన రైతు గుమ్మకొండ ఆంజనేయులు(30)కు దేవునిగుట్టతండా సమీపంలోని వ్యవసాయ పొలంలో వరికోత యంత్రం తగిలి విద్యుత్ స్తంభం విరిగిపోయింది. ఈ క్రమంలో రైతు విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చి విరిగిన స్తంభం స్థానంలో కొత్తది ఏర్పాటు చేయాలని విన్నవించాడు. దీంతో అధికారులు విద్యుత్ పనులు చేసే కాంట్రాక్టర్‌కు చెప్పి స్తంభం పాతేందుకు గోతులు తీసి స్తంభాలను ఎత్తే ట్రాక్టర్‌ను అక్కడికి పంపారు. దీంతో మండలంలోని బండమీదిపల్లి గ్రామానికి చెందిన సిద్దమోని మౌనికుమార్(28) విద్యుత్ పనులు చేసేందుకు తాత్కాలిక కూలీగా రాగా.. విద్యుత్ లైన్ పనులు చేస్తుండగా ఆకస్మికంగా విద్యుత్ షాక్ సంభవించి అక్కడికక్కడే ఇద్దరు దుర్మరణం చెందారు. కాగా ఆ పక్కనే ఉన్న మరో ఇద్దరు కూలీలు ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడ్డారు. మౌనికుమార్‌కు తల్లి జయమ్మ, తండ్రి నర్సింహులు ఉన్నారు. చేతికి అందివచ్చిన కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అలాగే కావేరమ్మపేటకు చెందిన ఆంజనేయులుకు భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు.
విచారించి చర్యలు
విద్యుత్ షాక్ ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తిస్థాయిలో విచారించి చర్యలు తీసుకుంటామని జడ్చర్ల విద్యుత్ శాఖ డీఈఈ చంద్రమౌలి తెలిపారు. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభత్వ పరంగా సహాయానికి చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కమలాకర్ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు.

నిర్లక్ష్యానికి రెండు ప్రాణాలు బలి

నిర్లక్ష్యానికి రెండు ప్రాణాలు బలి