
ముగిసిన ఆర్‌ఎస్‌ఎస్ సార్వజనికోత్సవం
జడ్చర్ల టౌన్: మండలంలోని స్వామినారాయణ గురుకుల్‌లో 15 రోజులుగా కొనసాగుతున్న ఆర్‌ఎస్‌ఎస్ సార్వజనికోత్సవం ఆదివారం రాత్రి ముగిసింది. ముగింపు వేడుకలకు స్థానిక ఎంపీ డీకే అరుణ హాజరయ్యారు. కార్యక్రమంలో ముఖ్యవక్తగా తెలంగాణ ప్రాంత సహకార్యవహ ఉప్పలాంచ మల్లికార్జున్ హాజరై ప్రసంగించారు. ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాలు జరుపుకొంటుందని, ఆర్‌ఎస్‌ఎస్ ప్రారంభమయ్యాక జాతిలో చాలా మార్పులు వచ్చాయన్నారు. వ్యక్తి నిర్మాణంతోనే దేశ నిర్మాణం జరుగుతుందని, 1962లో చైనా, 1965లో పాకిస్తాన్ యుద్ధాల్లో ఆర్‌ఎస్‌ఎస్ స్వయం సేవకులు ప్రత్యక్షంగా పాల్గొన్నారన్నారు. 1963 రిపబ్లిక్‌డే వేడుకల్లో 3 వేల మంది ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారని వివరించారు. పరమపూజనీయ హెడ్గేవార్ స్వామి వివేకానంద, శివాజిని ఆదర్శంగా తీసుకుని జాతి నిర్మాణం చేశారన్నారు. ఇవాళ ప్రపంచ దేశాలన్ని భారత్‌వైపు చూస్తున్నాయని, ప్రపంచానికి దేశం యోగా ఇచ్చిందన్నారు. అలాగే పెహల్గాంలో ఉగ్రదాడికి ప్రతీకారంగా ఉగ్రవాదులపై చేసిన పోరులో భారతశక్తి, సామర్థ్యాలు ఆశ్చర్యపరుస్తున్నాయన్నారు. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్‌లో తీవ్రవాదాన్ని భూస్థాపితం చేయగలిగామన్నారు. కార్యక్రమం ముగింపు సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్ విన్యాసాలను ఎంపీ డీకే అరుణ తిలకించారు. కార్యక్రమంలో వర్గ సర్వాధికారి వెంకట్‌రావు, తెలంగాణ ప్రాంత మానవీయ సంఘ్ చాలక్ బర్ల సురేందర్‌రెడ్డి, పాలమూరు విభాగ్ మానవీయ సంఘ్ చాలక్ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.