
వైభవంగా లక్ష్మీనర్సింహస్వామి ఉత్సవాలు
మహబూబ్‌నగర్ రూరల్: మన్యంకొండ శ్రీలక్ష్మీనర్సింహస్వామి (ఓబులేశు) ఉత్సవాలను ఆదివారం వైభవంగా నిర్వహించారు. దేవస్థానం సమీపంలోని మహబూబ్‌నగర్– రాయచూర్ అంతర్రాష్ట్ర రహదారి పక్కనున్న శ్రీలక్ష్మీనర్సింహస్వామి గుహలో బండరాయికి స్వయంభూగా వెలసిన స్వామివారికి మహానివేదన, సహస్ర నామార్చన, నక్షత్ర హారతి, ఆశీర్వాదం తదితర ప్రత్యేక పూజలు జరిపారు. ఉత్సవం సందర్భంగా గుహలోని బండరాయికి వెలసిన స్వామివారికి వివిధ రకాల పూలతో అలంకరించారు. అనంతరం స్వామివారిని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరిపై స్వామివారి అనుగ్రహం మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని చెప్పారు. అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు వేద ఆశీర్వాదం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నర్సింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, జనరల్ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.