
శరవేగంగా సాగుతున్న ‘టర్ఫ్’ పనులు
మహబూబ్‌నగర్ క్రీడలు: పై ఫొటోను చూస్తే ఒకప్పుడూ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లకు వేదిక అయిన ఎల్‌బీ స్టేడియమో, ఇప్పటి ఉప్పల్ స్టేడియంలా కనిపిస్తుందంటే మీరు పొరబడినట్లే. ఇది పాలమూరులోని ఎండీసీఏ క్రికెట్ మైదానం. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత హెచ్‌సీఏకు ఉన్న ఏకై క క్రీడా మైదానం. ఈ మైదానంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
అందుబాటులోకి గ్రీనరీ మైదానం...
ఉమ్మడి జిల్లాలోని క్రికెటర్ల కల త్వరలోనే నెరవేరబోతుంది. ఎండీసీఏ మైదానంలో మూడు టర్ఫ్ వికెట్‌లు అందుబాటులోకి తీసుకురానున్నారు. క్రికెట్‌లో టర్ఫ్ వికెట్ (పిచ్)కు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. కేవలం మ్యాట్‌ల మీద క్రికెట్ ఆడే క్రీడాకారులకు టర్ఫ్ వికెట్‌పై ఆడాలంటే మెరుగైన ప్రాక్టీస్ అవసరం. అలాంటి టర్ఫ్ వికెట్ పిచ్‌లను ఎండీసీఏ మైదానంలో ఏర్పాటు చేస్తున్నారు. గత ఏడాది ఎండీసీఏ మైదానంలో వేసవి క్రికెట్ శిక్షణా శిబిరం ప్రారం భోత్సవంలో పలువురు హెచ్‌సీఏ ప్రతినిధులు పాల్గొనగా మైదానంలో టర్ఫ్ వికెట్ ఏర్పాటు చేయాలని ఎండీసీఏ ప్రతినిధులు వారి దృష్టికి తీసుకెళ్లారు. నిధులు మంజూరు కావడంతో మైదానంలో టర్ఫ్ వికెట్ పిచ్‌లు, గ్రీనర్ అభివృద్ధి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మైదానంలో గ్రీనర్ ఏర్పాటు పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. మైదానంలో వర్షపునీరు నిలువకుండా ఎత్తుపెంచి చుట్టూ అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేస్తున్నారు.
త్వరలో జాతీయస్థాయి టోర్నీ
మైదానంలో మూడు టర్ఫ్ వికెట్ పిచ్‌లు, గ్రీనరీ అందుబాటులోకి రానుండడంతో త్వరలో హెచ్‌సీఏ వారు ఇక్కడి మైదానంలో జాతీయస్థాయి హెచ్‌సీఏ టోర్నీ నిర్వహించనున్నట్లు సమాచారం. ఎండీసీఏ మైదానంలో అండర్–19 టోర్నీ లేదా అండర్–16 టోర్నీ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టోర్నీ జరిగి దేశంలోని వివిధ రాష్ట్రాల జట్లు వస్తే ఈ మైదానానికి దేశవ్యాప్తంగా గుర్తింపు వస్తుంది. భవిష్యత్తులో రంజీ మ్యాచ్‌లకు కూడా ఎండీసీఏ మైదానం వేదిక అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్‌కు కృతజ్ఞతలు
ఎండీసీఏ మైదానంలో టర్ఫ్ వికెట్ పిచ్‌లు, గ్రీనరీ ఏర్పాటు, అభివృద్ధి కోసం హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ రూ.60 లక్షలు కేటాయించి పనులు చేయిస్తోంది. ఈ మైదానం అభివృద్ధి కోసం అన్ని విధాల సహకారం అందిస్తున్న హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్‌కు కృతజ్ఞతలు. ఎండీసీఏ మైదానంలో టర్ఫ్ వికెట్ పిచ్‌లు, గ్రీనరీ ఏర్పాటు చేయాలనే కల నెరవేరబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. టర్ఫ్ వికెట్ ఏర్పాటైతే జిల్లా క్రీడాకారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఉమ్మడి జిల్లా క్రికెటర్లు రంజీ, భారత జట్టుకు ఆడాలన్నదే తన లక్ష్యం.
– ఎం.రాజశేఖర్,
ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి
రూ.60 లక్షలతో పనులు ప్రారంభం
త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం

శరవేగంగా సాగుతున్న ‘టర్ఫ్’ పనులు

శరవేగంగా సాగుతున్న ‘టర్ఫ్’ పనులు