
కన్నీళ్లు దిగమింగుకొని.. కూతుళ్లను చదివించి..
అమరచింత: ఇంటికి పెద్ద దిక్కు అయిన భర్త 26 ఏళ్ల క్రితం ప్రమాదవశాత్తు మృతి చెందడంతో భార్యకి భవిష్యత్ అంతా అంధకారం అలుముకున్నట్లయ్యింది. కానీ, తమ ఇద్దరు పిల్లల కోసం కన్నీళ్లను దిగమింగుకొని ఆమె జీవితంలో ముందడుగు వేసింది. కుట్టుమిషన్‌తో ఉపాధి పొందుతూ.. ఇద్దరు అమ్మాయిలను ఉన్నత చదువులు చదివించి ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది అమరచింతకు చెందిన ఉప్పరి గితమ్మ. వివరాల్లోకి వెళ్తే.. అమరచింతకి చెందిన ఉప్పరి ప్రభాకర్, గితమ్మ భార్యభర్తలు. చిన్న, చిన్న కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగించే వారు. 1999వ సంవత్సరంలో ప్రభాకర్ ప్రమాదవశాస్తు మృతి చెందాడు. భర్త చనిపోయిన నాటికి గితమ్మకు ఇద్దరు కూతుళ్లు.. 5 ఏళ్ల ఇంద్రజ, మూడేళ్ల సింధూజ ఉన్నారు. చిన్నతనంలో భర్తను కోల్పోయిన గితమ్మ.. తన ఇద్దరు పిల్లల కోసం బాధనంతా తనలోనే దిగమింగుకొంది. తన ఇద్దరు కూతుళ్లకు ఉన్నత చదువులు.. భవిష్యత్ ఇవ్వాలనుకుంది. దీంతో కుట్టుమిషన్‌తో స్వయం ఉపాధి పొందడం ప్రారంభించింది. వచ్చిన చిన్నపాటి ఆదాయంతో అటు కుటుంబ పోషణ, ఇటు పిల్లలను చదివించింది. ప్రస్తుతం పెద్ద కూతురు ఇంద్రజ వెటర్నరీ కోర్సు పూర్తి చేసి.. వెటర్నరీ అసిస్టెంట్‌గా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించింది. చిన్న కూతురు సిందూజ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతుంది. పిల్లలిద్దరికి మంచి భవిష్యత్‌ను ఇవ్వడమే తన లక్ష్యమని.. ఎన్ని ఇబ్బందులు కలిగినా ముందుకు వెళ్లానని గీతమ్మ తెలిపింది.
అమ్మ కష్టం వృథా చెయ్యలేదు
అమ్మ కష్టం వృథా చెయ్యకుండా కష్టపడి చదివి వెటర్నరీ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించాను. తనకు ఐదేళ్ల వయస్సు ఉన్నప్పుడే నాన్న చనిపోవడంతో అమ్మే అన్నీ తానై తమను చూసుకుంది. ఆడపిల్లలంటేనే చిన్నచూపు చూసే ఈ రోజుల్లో తనకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నా.. పురుషులతో సమానంగా అమ్మ తమను ఉన్నత చదువులు చదివించింది. అమ్మ కష్టం వృథా కాకుండా కష్టపడి చదివాం. ఉద్యోగం సాధించా. అమ్మను కంటికి రెప్పలా చూసుకుంటాం. – ఇంద్రజ, అమరచింత