
వేసవిలో ‘చల్లని’ సేవ
మరికల్: వేసవిలో బాటసారుల దాహార్తి తీర్చేందుకు ఎంతో మంది స్వచ్ఛందంగా అంబలి, చలివేంద్రాలు ఏర్పాటు చేసి దాతృత్వం చాటుకుంటున్నారు. అయితే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మొట్టమొదట దివంగత మాజీ ఎమ్మెల్యే వీరారెడ్డి కుటుంబ సభ్యులు మరికల్ మండలం తీలేర్ స్టేజీ వద్ద అంబలి కేంద్రం ఏర్పాటు చేశారు. వీరి స్ఫూర్తితో మరికల్ మండల అయ్యప్ప సేవాసమితి ఆధ్వర్యంలో అంబలి కేంద్రాన్ని ప్రారంభించారు. 22 ఏళ్లుగా ప్రతి వేసవిలో బాటసారులు, కూలీల దాహార్తి తీరుస్తున్నారు. వీరి ఆదర్శంతో ఇతర మండలాలు, గ్రామీణ స్టేజీల వద్ద అంబలి కేంద్రాలను ఏర్పాటుచేసి వేసవిలో చల్లని సేవ అందిస్తున్నారు.
44 ఏళ్ల క్రితం..
ఈ ప్రాంత ప్రజలు రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితుల్లో మండుటెండలను సైతం లెక్క చేయకుండా పడుతున్న శ్రమను చూసి దివంగత మాజీ ఎమ్మెల్యే కె.వీరారెడ్డి తండ్రి వెంకారెడ్డి చల్లించిపోయారు. తాను సర్పంచ్‌గా ఎన్నికై న తర్వాత వేసవిలో ప్రజల దాహార్తి తీర్చేందుకు గాను 1981లో తీలేర్ స్టేజీ వద్ద అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇలా ప్రతి ఏడాది వేసవిలో అంబలి కేంద్రం నిర్వహిస్తూ వ్యవసాయ కూలీలతో పాటు బాటసారుల దాహం తీర్చే వారు. అయితే వెంకారెడ్డి మరణానంతరం ఈ బాధ్యతను మాజీ ఎమ్మెల్యే వీరారెడ్డి కొనసాగించారు. అతడి మరణం తర్వాత ఆయన కుమారుడు, డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి తన అవ్వ వజ్రమ్మ, తాత వెంకారెడ్డి, తండ్రి వీరారెడ్డి జ్ఞాపకర్థంగా అంబలి కేంద్రాన్ని కొనసాగిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
అయ్యప్ప అనుగ్రహంతోనే సేవ..
అయ్యప్ప సేవాసమితి స్థాపించిన నాటి నుంచి బాటసారుల తీర్చేందుకు అంబలి కేంద్రం ఏర్పాటు చేస్తున్నాం. అయ్యప్పస్వామి అనుగ్రహంతో 22 ఏళ్లుగా అంబలి కేంద్రాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనసాగిస్తున్నాం. భవిష్యత్‌లో కూడా కొనసాగిస్తాం.
– సతీశ్‌కుమార్, మరికల్
ఆనందంగా ఉంది..
మరికల్ బస్టాండ్, చౌరస్తాలో యువక మండలి తరఫున చలివేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజల దాహార్తి తీరుస్తున్నాం. 30 ఏళ్లుగా సేవా కార్యక్రమాలను నిర్వహించడం ఆనందంగా ఉంది. భవిష్యత్‌లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం.
– శ్రీకాంత్‌రెడ్డి,
యువక మండలి అధ్యక్షుడు, మరికల్
తీలేర్ అంబలి కేంద్రానికి 44 ఏళ్లు పూర్తి
వేసవిలో ప్రజల దాహార్తి తీరుస్తున్న దాతలు

వేసవిలో ‘చల్లని’ సేవ

వేసవిలో ‘చల్లని’ సేవ

వేసవిలో ‘చల్లని’ సేవ