మెరిసిన పేదింటి విద్యాకుసుమం
గట్టు: ఇంటర్ ఫలితాల్లో పేదింటి విద్యాకుసుమం మెరిసింది. పుట్టింది పూరి గుడిసెలో అయినా చదువులో మాత్రం ఏకంగా రాష్ట్రస్థాయిలో సత్తా చాటింది. గట్టు మండలం రాయాపురం గ్రామానికి చెందిన లావణ్య ఇంటర్ మొదటి సంవత్సరం బైపీసీలో 439/440 మార్కులతో రాష్ట్రస్థాయి మొదటి ర్యాంకు సాధించింది. సామాన్య రైతు కుటుంబం అయిన బోయ నర్సమ్మ, ఆటో లక్ష్మణ్‌కు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె లావణ్య 1, 2 తరగతులు బల్గెరలో, 3 నుంచి 5 తరగతులు ఆలూరులో, 6 నుంచి 10వ తరగతి వరకు కేటిదొడ్డి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో చదువుకుంది. 10వ తరగతిలో 9.8 గ్రేడ్‌తో ఉత్తీర్ణత సాధించిన లావణ్య.. ఇంటర్ బాలానగర్ గురుకులంలో చదువుతుంది. మొదటి సంవత్సరం బైపీసీలో అత్యధికంగా 439/440 మార్కులు సాధించి రాష్ట్ర టాపర్‌గా నిలిచింది. గ్రామీణ పేదింటి విద్యార్థిని రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు రాజుసాగర్, శ్రీనివాసులు, వీరేష్, రంగస్వామితో పాటు బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి బల్గెర హనుమంతు నాయుడు బుధవారం విద్యార్థిని లావణ్యను సన్మానించి అభినందించారు.
ఇంటర్‌లో మొదటి ర్యాంకు
సాధించిన రాయాపురం లావణ్య


