విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
వీపనగండ్ల: విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన వీపనగండ్ల మండలం కల్వరాలలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ కె.రాణి వివరాల మేరకు.. కల్వరాలకు చెందిన రామన్‌గౌడ్ (51) మంగళవారం రాత్రి తన ఇంట్లోని బాత్‌రూంలో నీళ్లు పట్టేందుకు విద్యుత్ మోటారు ఆన్ చేశాడు. నీళ్లు పడుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య రజిని, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో కుటుంబ సభ్యులు ఎవరూ లేరని.. చుట్టుపక్కల వారు గమనించి వారికి సమాచారం ఇచ్చినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. రామన్‌గౌడ్ మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది.
ఆటో ఢీకొని
యువకుడి దుర్మరణం
మరికల్: ఆటో ఢీకొట్టిన ఘటనలో యువకుడు మృతి చెందిన ఘటన పస్పుల స్టేజీ సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మరికల్‌కు చెందిన టంకర శివ(23) పస్పులలో మోటార్ మరమ్మతు చేసి రాత్రి బైక్‌పై మరికల్‌కు తిరిగి వస్తుండగా పస్పుల స్టేజీ వద్ద ఎదురుగా వస్తున్న పాల ఆటో వేగంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ ఎల్లయ్య, మసుద్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.
బైక్‌ను ఢీకొట్టిన కారు
● ఒకరి మృతి
మహబూబ్‌నగర్ క్రైం: ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి కారు వేగంగా ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. రూరల్ ఎస్‌ఐ విజయ్‌కుమార్ కథనం ప్రకారం.. జిల్లాకేంద్రానికి చెందిన గార్లపాడ్ రమేష్(55) బుధవారం ఉదయం 8.30 ప్రాంతంలో మహబూబ్‌నగర్ నుంచి జడ్చర్ల వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తుంటే మార్గమధ్యలోని అప్పన్నపల్లి మారుతీ షోరూం సమీపంలో వెనుక నుంచి వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. రమేష్ తలకు తీవ్ర గాయాలు కాగా వెంటనే జనరల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య భాగ్యలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు.
శుభకార్యానికి
వెళ్లివస్తుండగా..
నాగర్‌కర్నూల్ క్రైం: ప్రమాదవశాత్తు బైక్ పైనుంచి పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మున్సిపాలిటీ పరిధిలోని నాగనూలు సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ గోవర్ధన్ తెలిపిన వివరాలు.. రేవల్లి మండలం నాగపూర్ గ్రామానికి చెందిన మల్లయ్య (52) బైక్‌పై జిల్లా కేంద్రంలో ఓ శుభకార్యానికి వస్తుండగా ఎదురుగా వచ్చిన వాహనాన్ని తప్పించబోయి ప్రమాదవశాత్తు కింద పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనరల్ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుమారుడు నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
కొత్తకోట రూరల్: అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతిచెందిన ఘటన కొత్తకోట మండలం కానాయపల్లి సమీపంలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. ఏదుల మండలం ముత్తిరెడ్డిపల్లికి చెందిన చెన్నమ్మ, కుర్మయ్య దంపతులు కొన్నేళ్లుగా వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామంలో నివాసముంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి రెండవ కుమార్తె బాలమణి (28) భర్త కొన్నేళ్ల క్రితం మృతి చెందాడు. ఆమె ఆరేళ్లుగా కొత్తకోట మండలం కానాయపల్లి శివారులోని బుచ్చారెడ్డి ఇంట్లో పనిమనిషిగా పనులు చేస్తుండేది. అతడి ఇంట్లో బాలమణికి కేటాయించిన గదిలోనే ఆమె అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. మృతురాలి తల్లి చెన్నమ్మ ఫిర్యాదు మేరకు బుచ్చారెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
చికిత్స పొందుతూ
వృద్ధుడి మృతి
కొత్తకోట రూరల్: ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన వృద్ధుడు చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. ఎస్‌ఐ ఆనంద్ వివరాల మేరకు.. మండలంలోని అమడబాకులకు చెందిన గొల్ల బండలయ్య (80) గత నెల 26న కొత్తకోటలో నడుచుకుంటూ వెళ్తుండగా.. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో బండలయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి


