అన్ని హంగులతో విజ్ఞాన కేంద్రం
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: జిల్లాకేంద్రంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్ ప్రాంగణంలో అన్ని హంగులతో పూలే అంబేడ్కర్ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంగణంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం వెజ్, నాన్–వెజ్ మార్కెట్‌ను రూ.4.50 కోట్లతో చేపట్టి మధ్యలోనే ఆపేసిందన్నారు. దీనిని తాజాగా అధునాతన నాలెడ్జ్ సెంటర్‌గా మార్పు చేయించి మొత్తం రూ.17.31 కోట్లను కేటాయించామన్నారు. ఈ మేరకు సీడీఎంఏ నుంచి జీఓ జారీ అయిందని, ముందుగా రూ.పది కోట్లు మంజూరయ్యాయన్నారు. ఈ నిధులతో అంతర్జాతీయ స్థాయిలో లైబ్రరీ స్థాపించి కనీసం లక్ష పుస్తకాలు అందుబాటులో ఉంచుతామన్నారు. అలాగే సెమినార్ హాల్స్, రీడింగ్ రూమ్స్, డిజిటల్ హాల్స్, క్లాస్ రూంలతో ప్రజలందరూ గర్వపడేలా ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామన్నారు. అలాగే మెట్టుగడ్డలోని డైట్ కళాశాల ప్రాంగణంలో మరో వెజ్, నాన్–వెజ్ మార్కెట్ పేరిట అప్పటి ప్రభుత్వం నిర్మాణం చేపట్టి అర్ధాంతరంగా నిలిపివేసిందన్నారు. దీనిని కూడా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌గా మార్పు చేయిస్తున్నామన్నారు. అనంతరం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్ ప్రాంగణంలో పిల్లర్లకే పరిమితమైన వెజ్, నాన్–వెజ్ మార్కెట్ భవన నిర్మాణాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్‌ఖాద్రీ, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్‌యాదవ్, గుండా మనో హర్, రాజుగౌడ్, దేవేందర్‌నాయక్ పాల్గొన్నారు.
సీడీఎంఏ నుంచి రూ.17.31 కోట్లు మంజూరు
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి


