పేద విద్యార్థులకు చేయూత
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఉన్నత విద్య అభ్యసించేందుకు గాను ఎంట్రెన్స్ పరీక్షలు రాసి ర్యాంకులు సాధించాలనే తపన ఉన్న చాలా మంది విద్యార్థులకు ఆర్థిక పరిస్థితి అనుకూలించదు. ఐఐటీ, నీట్, ఎంసెట్ వంటి పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకునేందుకు ప్రస్తుత పరిస్థితుల్లో రూ.లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో పేద విద్యార్థులకు చేయూత అందిస్తున్నారు మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి. వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ అందించేందుకు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ఏడు నెలల క్రితం బాలికల, బాలుర జూనియర్ కళాశాలల విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం శిక్షణ చివరి దశలో ఉంది. తాజాగా జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ కళాభవన్‌లో ఎస్‌ఐ, కానిస్టేబుల్, వీఆర్‌ఓ, టెట్ వంటి పోటీ పరీక్షలకు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుమారు 700 మంది అభ్యర్థులు శిక్షణ పొందేందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ పరీక్ష కోసం సుమారు 150 మంది విద్యార్థులు స్థానిక బాలికల జూనియర్ కళాశాలలో ఓ సంస్థ ఆద్వర్యంలో శిక్షణ పొందుతున్నారు. వారికి ఉచితంగా భోజన సదుపాయాన్ని ఎమ్మెల్యే కల్పిస్తున్నారు. దీంతో ప్రైవేటు కోచింగ్ సెంటర్ల ఫీజుల భారం తగ్గిందని విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కోచింగ్ బాగుంది..
కొన్ని నెలలుగా ఇక్కడ శిక్షణ తీసుకుంటున్నా. ఏమైనా సందేహాలు ఉంటే వెంటనే నివృత్తి చేస్తున్నారు. మంచి స్టడీ మెటీరియల్ కూడా ఇవ్వడంతో చదువుకునేందుకు వీలుగా ఉంది. సీటు సాధించాలనే ఆశయంతో సెలవుల్లో కూడా ఇక్కడే ఉండి చదువుకుంటున్నాం.
– స్వాతి, ఎంసెట్ అభ్యర్థిని
అన్ని వసతులు ఉన్నాయి..
ఇక్కడ చదువుకునేందుకు అన్ని వసతులను ఎమ్మెల్యే కల్పించడం గొప్ప విషయం. ప్రైవేటు కోచింగ్ సెంటర్లకు వెళ్లే పరిస్థితి లేని క్రమంలో ఇక్కడ చదువుకునేందుకు మంచి ప్లాట్‌ఫాం దొరికింది. స్టడీ మెటీరియల్స్, స్టడీ చైర్స్, హాస్టల్ వసతి అన్ని కల్పించారు. సీటు సాధించే విధంగా చదువుకుంటున్నాం.
– మహాలక్ష్మీ, ఎంసెట్ అభ్యర్థిని
విజయ తీరాలకు చేర్చుతాం..
జిల్లాలో అనేక మంది విద్యార్థులకు చదవాలనే కోరిక ఉన్నప్పటికీ.. ఆర్థిక పరిస్థితుల కారణంగా వెనకడుగు వేస్తున్నారు. పేద విద్యార్థులకు చదువు భారం కావొద్దని ఉచితంగా ఐఐ టీ, నీట్, ఎంసెట్ కోచింగ్ ఇప్పిస్తున్నాం. వారికి భోజన వసతి కూడా కల్పిస్తున్నాం. నాణ్యతలో రాజీ లేకుండా ప్రైవేటు కోచింగ్ సెంటర్ల వారి సహకారంతో శిక్షణ ఇస్తున్నాం. ఉన్నతంగా ఎదగాలనే కోరిక ఉన్న విద్యార్థుల ను విజయతీరాలకు చేర్చేందుకు కృషి చేస్తున్నాం.
– యెన్నం శ్రీనివాస్‌రెడ్డి,
ఎమ్మెల్యే, మహబూబ్‌నగర్
ఐఐటీ, నీట్, ఎంసెట్ కోచింగ్‌కు సంబంధించి సుమారు 150 మంది విద్యార్థులకు క్రాష్ కోర్సు నిర్వహిస్తున్నారు. అయితే విద్యార్థులకు మెరుగైన శిక్షణ అందించడంలో ఎలాంటి రాజీ లేకుండా కొన్నేళ్లుగా ఐఐటీ, నీట్ స్థాయిలో కోచింగ్ అందిస్తున్న రిషి, ప్రతిభ కళాశాలల అధ్యాపకులు ఇక్కడ బోధిస్తున్నారు. వీటితో పాటు మంచి స్టడీ మెటీరియల్స్, ప్రాక్టీస్ టెస్టులు, స్టడీ చైర్‌లు, పరీక్ష ప్యాడ్‌లు ఉచితంగా అందించారు. ఇక భోజన, వసతి సదుపాయం బాలికలకు జిల్లా కేంద్రంలోని బీసీ హాస్టల్‌లో కల్పించారు. బాలురకు మెట్టుగడ్డ వద్ద ఉన్న ఎస్సీ హాస్టల్‌లో వసతి కల్పించారు. ఇక అంబేడ్కర్ కళాభవన్‌లో ఇస్తున్న కోచింగ్‌కు పలు ప్రఖ్యాత కోచింగ్ సెంటర్ల అధ్యాపకులను పిలిపించి ఇక్కడ శిక్షణ ఇప్పిస్తున్నారు. ఇందుకు రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
మెరుగైన కోచింగ్..
ఎంసెట్, నీట్‌కు ఉచితంగా కోచింగ్ ఇప్పిస్తున్న ఎమ్మెల్యే యెన్నం
ఏడు నెలలుగా కొనసాగుతున్న శిక్షణ కార్యక్రమం
తాజాగా ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు కోచింగ్ ప్రారంభం
పేద విద్యార్థులకు చేయూత
పేద విద్యార్థులకు చేయూత
పేద విద్యార్థులకు చేయూత


