
కోర్టు డ్యూటీల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
మహబూబ్‌నగర్ క్రైం: పోలీస్ వ్యవస్థపై విశ్వాసం నిలబెట్టాలంటే ప్రతి అధికారి తన విధులను నిబద్ధతతో, సమర్థవంతంగా నిర్వహించాలని ఎస్పీ డి.జానకి సూచించారు. జిల్లా ఎస్పీ సమావేశ మందిరంలో శనివారం కోర్టు డ్యూటీ, కోర్టు లైజన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. న్యాయ సంబంధిత విధుల్లో నిర్లక్ష్యం అంగీకరించడం సరికాదని, ప్రతి కేసు విచారణలో చార్జిషీట్‌లను నిర్దేశిత కాల వ్యవధిలో న్యాయస్థానాలకు సమర్పించాల్సిన అవసరం ఉందన్నారు. సాక్షులను హాజరుపరిచే విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌లతో సమన్వయం మెరుగుపరుచుకోవాలని సూచించారు. కోర్టులలో కేసుల పరిష్కార వేగాన్ని పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. అనుమానితులను కోర్టుకు హాజరుపరిచే సమయంలో వారిని సురక్షితంగా సమయానికి న్యాయస్థానాలకు తరలించడానికి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలాంటి భద్రత లోపాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. కోర్టు డ్యూటీలలో నిర్లక్ష్యం చేసే అధికారులపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. సమావేశంలో డీఎస్పీలు రమణారెడ్డి, సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు.
● జిల్లాలో ఆదివారం నుంచి ప్రారంభమయ్యే తెలంగాణ ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్ పరీక్ష కేంద్రాల దగ్గర 163 బీఎన్‌ఎస్‌ఎస్ అమల్లో ఉంటుందని ఎస్పీ డి.జానకి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 8 పరీక్ష కేంద్రాల వద్ద 163సెక్షన్ ఉంటుందని, ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పరీక్ష కేంద్రాల దగ్గర ఎవరూ గుమ్మికూడరాదని పేర్కొన్నారు.