
జడ్చర్లలో గాలివాన బీభత్సం
జడ్చర్ల టౌన్/రాజాపూర్/నవాబుపేట: జడ్చర్ల నియోజకవర్గంలో శుక్రవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో పాటు ఉరుములు, మెరుపులతో వనగండ్ల వర్షం కురిసింది. జడ్చర్ల మండలంలోని మాచారం, పోలేపల్లి, గంగాపురం, మల్లెబోయిన్‌పల్లి, జడ్చర్ల పట్టణంలో పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి విద్యుత్ తీగలపై పడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ట్రాన్స్‌ఫార్మర్ సైతం ఒరిగిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో ఫ్లెక్సీలు, ప్లాస్టిక్ కవర్లు గాలులకు ఎగిరి కరెంట్ తీగలపై పడ్డాయి. రాజాపూర్ మండలంలోని ముదిరెడ్డిపల్లి, రాయపల్లి, నందిగామలో వడగండ్ల పడ్డాయి. పలు చోట్ల వడ్లు, మామిడి కాయలు రాలిపోయాయి. ముదిరెడ్డిపల్లి నుంచి రాయపల్లి గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై చెట్లు విరిగి అడ్డంగా పడటంతో గ్రామానికి వెళ్లే ప్రజలు ఇబ్బందుల పడ్డారు. నవాబుపేట మండలం కారూర్‌లో గాలివానకు పెంపుడు పందుల షెడ్డు ధ్వంసం కావడంతో నిర్వాహకుడు ఆంజనేయులుకు దాదాపు రూ.10 లక్షల నష్టం వాటిల్లింది. కాగా.. వీలైనంతంగా త్వరగా విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నట్లు ఏడీఈ చంద్రశేఖర్ తెలిపారు.
● కావేరమ్మపేట శివారులో వ్యవసాయ పొలంలో వెంకటయ్యకు చెందిన రెండు గేదెలు పిడుగుపాటుకు గురై మృతి చెందాయి. గేదెల విలువ దాదాపు రూ.1.20 లక్షలు ఉంటుందని.. ప్రభుత్వపరంగా ఆదుకోవాలని బాధిత రైతు కోరారు. బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌యార్డు ఆవరణలో ఆరబోసిన మొక్కజొన్న వర్షానికి తడిసిపోయింది.

జడ్చర్లలో గాలివాన బీభత్సం

జడ్చర్లలో గాలివాన బీభత్సం

జడ్చర్లలో గాలివాన బీభత్సం