ముదిరాజ్ అభ్యున్నతికి కృషి: ఎమ్మెల్యే యెన్నం
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ముదిరాజ్‌ల అభ్యున్నతి కోసం తన వంతు పాటుపడుతానని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ముదిరాజ్ సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ముదిరాజ్ భవనంలో నిర్వహించిన ముదిరాజ్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లాకేంద్రం నడిబొడ్డున ఉన్న ముదిరాజ్ భవనాన్ని ఓ విజ్ఞాన కేంద్రంగా మారుద్దామని అందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. చదువుకుంటేనే సమాజంలో మంచి గుర్తింపు రావడంతో పాటు ఉన్నత శిఖరాలకు చేరుకుంటామన్నారు. అందుకోసం ప్రతి ఒక్కరూ తమ బిడ్డలను బాగా చదివించాలని ముదిరాజ్‌లలో కూడా బాగా చదువుకుని ఉన్నత శిఖరాలకు వెళ్లిన వారు ఉన్నారన్నారు. ముదిరాజ్ భవనాన్ని భవిష్యత్ తరాలు గుర్తించుకునేలా తీర్చిదిద్దుదామన్నారు. సమాజాన్ని అర్థం చేసుకునే స్వభావం ముదిరాజ్‌లకు ఉందని ప్రేమ గల మనుసులు ముదిరాజ్‌లు అని అన్నారు. పీసీసీ నాయకులు ఎన్‌పీ వెంకటేశ్, సంజీవ్ ముదిరాజ్ మాట్లాడుతూ బీసీ డీలో ఉన్న ముదిరాజ్‌లను బీసీ ఏలోకి మార్చాలని అందుకు ఎమ్మెల్యే కృషి చేయాలని కోరారు. ముదిరాజ్‌లు రాజకీయంగా ఎదిగిన నాడే అభివృద్ధి చెందుతారని అన్నారు. కార్యక్రమంలో నాయకులు మైత్రియాదయ్య, కృష్ణముదిరాజ్, పెద్ద విజయ్‌కుమార్, రశ్రీనివాసులు, విజయ్‌కుమార్, నారాయణ, వెంకన్న, ఏఓ శంకర్, రామకృష్ణ, కిషోర్, లక్ష్మన్, యాదయ్య, వెంకటేశ్ పాల్గొన్నారు.


