మట్టి తరలింపు వేగవంతం
అచ్చంపేట: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగంలోని ప్రమాద ప్రదేశంలో మట్టి, బురద తవ్వకాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రమాదం జరిగి శుక్రవారం నాటికి 56 రోజులు గడిచినా మిగిలిన ఆరుగురి ఆచూకీ లభించలేదు. డీ2 ప్రదేశంలో ఐదు ఎస్కవేటర్లతో మట్టి, బురద తవ్వి కన్వేయర్ బెల్టు ద్వారా, టీబీఎం భాగాలను కత్తిరించి శకలాలను లోకో ట్రైన్‌లో బయటకు తరలిస్తున్నారు. పైకప్పు కూలిన ప్రదేశం నుంచి వస్తున్న నీటి ఊటను భారీ మోటార్ల సాయంతో ఎప్పటికప్పుడు కృష్ణానదిలోకి పంపింగ్ చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల 12 రకాల సహాయక బృందాల్లోని 560 మంది సిబ్బంది నిత్యం మూడు షిఫ్ట్‌లలో సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా సహాయక చర్యలు పూర్తి చేసేందుకు సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తున్నారు. మరో రెండ్రోజుల్లో నిషేధిత ప్రదేశం వరకు మట్టి, శిథిలాల తొలగింపు పూర్వవుతుందని సహాయక సిబ్బంది వివరించారు.
కొనసాగుతున్న సహాయక చర్యలు..
ప్రమాదంలో చిక్కుకున్న ఆరుగురి జాడ కనుగొనేందుకు సొరంగంలోని ప్రమాద ప్రదేశంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని ప్రత్యేకాధికారి శివశంకర్ లోతేటి తెలిపారు. శుక్రవారం దోమలపెంట ఎస్‌ఎల్‌బీసీ వద్ద జేపీ కార్యాలయంలో సహాయక బృందాల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సహాయక బృందాల ఉన్నతాధికారుల పర్యవేక్షణలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని, వారికి అవసరమైన సామగ్రి, వసతులు, పౌష్టికాహారం సమకూర్చుతున్నామని చెప్పారు. సమావేశంలో ఆర్మీ అధికారులు వికాస్‌సింగ్, విజయ్‌కుమార్, జేపీ కంపెనీ సీనియర్ ప్రాజెక్టు ఇంజనీర్ సంజయ్‌కుమార్ సింగ్, సింగరేణి మైన్స్ రెస్క్యూ జనరల్ మేనేజర్ బైద్య, ఎన్డీఆర్‌ఎఫ్ అధికారి గిరిధర్‌రెడ్డి, హైడ్రా అధికారి, దక్షిణ మధ్య రైల్వే అధికారి రవీంద్రనాథ్ పాల్గొన్నారు.
56 రోజులుగా సాగుతున్న సహాయక చర్యలు.. లభించని ఆరుగురి ఆచూకీ


