సహాయక చర్యలు వేగవంతం
అచ్చంపేట: ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ప్రమాదంలో చిక్కుకున్న కార్మికుల ఆచూకీ కోసం సహాయక చర్యలను ముమ్మరం చేశారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించి బయటకు తెచ్చేందుకు సహాయక సిబ్బంది విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆదివారం సొరంగం ప్రమాద ప్రదేశం నుంచి పెద్ద పెద్ద బండరాళ్లను ఎస్కవేటర్ల సాయంతో విచ్చిన్నం చేసి లోకో ట్రైన్ ద్వారా బయటకు తరలించారు. ప్రమాద ప్రదేశానికి చేరుకునేందుకు మార్గం ఏర్పాటు పనులను వేగవంతం చేశారు. సహాయక చర్యలు అత్యంత సమగ్రంగా, ప్రణాళికా బద్ధంగా కొనసాగుతున్నా యి. అయితే కన్వేయర్ బెల్టు తెగిపోతుండటంతో పనులకు ఆటంకంగా మారుతోంది. ఎప్పటికప్పుడు కన్వేయర్ బెల్టును పునరుద్ధరిస్తూ ఎస్కవేటర్ల సాయంతో మట్టిని బయటకు తరలిస్తున్నారు.
కొనసాగుతున్న బండరాళ్ల తొలగింపు..
నిర్దేశిత గడువులోగా సొరంగం ప్రమాద ప్రదేశంలో పనులు పూర్తిచేసేందుకు సహాయక బృందాలు శ్రమిస్తున్నాయని ప్రత్యేకాధికారి శివశంకర్ లోతేటి అన్నారు. సొరంగం ఇన్‌లేట్ వద్ద జేపీ కార్యాలయంలో సహాయక బృందాల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. సొరంగం లోపల చేపడుతున్న సహాయక చర్యలను ఉన్నతాధికారులు ప్రత్యేకాధికారికి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సొంరగం లోపల కన్వేయర్ బెల్టు మరమ్మతు, వెంటిలేషన్ పొడిగింపు పనులతో పాటు మట్టి తవ్వకాలు చేపడుతున్నట్లు తెలిపారు. సొరంగం కూలిన ప్రదేశం నుంచి ఉబ్చికి వస్తున్న నీటి ఊటను ఎప్పటికప్పుడు బారీ మోటార్ల సాయంతో బయటకు పంపింగ్ చేస్తున్నామని చెప్పారు. సమావేశంలో ఆర్మీ అధికారులు వికాస్‌సింగ్, విజయ్‌కుమార్, జేపీ కంపెనీ సీనియర్ ప్రాజెక్టు ఇంజినీర్ సంజయ్‌కుమార్ సింగ్, సింగరేణి మైన్స్ రెస్క్యూ జనరల్ మేనేజర్ బైద్య, ఎన్‌డీఆర్‌ఎఫ్ అధికారి గిరిధర్‌రెడ్డి, హైడ్రా అధికారి, దక్షిణమధ్య రైల్వే అధికారి రవీంద్రనాథ్ తదితరులు ఉన్నారు.
మరో 10 రోజుల్లో శిథిలాల తొలగింపు పూర్తిచేసేందుకు ప్రయత్నాలు
నిపుణుల సూచనల మేరకు..
సొరంగంలో నిపుణులు, అనుభవజ్ఞులైన వారి సూచనలు, సలహాల మేరకు సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రధానంగా జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందినశాస్త్రవేత్తలు, నీటిపారుదల నిపుణులు, సొరంగం నిర్మాణంలో అనుభవం కలిగిన ఇంజినీర్లతో పాటు సంబంధిత శాఖల నిపుణుల సూచనలు, సలహాలు అనుసరించి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. సొరంగంలో వాతావరణం, మట్టి నిల్వలు, నీటి ప్రవాహం తదితర అంశాలపై నిత్యం పరిశీలనలు చేపడుతూ.. వీటి ఆధారంగా తదుపరి చర్యలు వేగవంతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.


