సేంద్రియ వ్యవసాయంతో లాభం
అలంపూర్: పూర్వం సేంద్రియ ఎరువులతోనే వ్యవసాయం జరిగేది. అప్పట్లో రసాయన ఎరువులు, పురుగు మందులు వినియోగించకుండా సేంద్రియ ఎరువులతో పంటలు పండించే వారు. కాలక్రమేణ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార దిగుబడులు పెంచడానికి ఆధునిక వంగడాలతో పాటు రసాయనాలు వినియోగించుకోవాల్సిన అవసరం నెలకొంది. రసాయన ఎరువులు, పురుగు మందులు అధికంగా వాడుతూ.. దిగుబడులు పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిస్థితులను అధిగమించి సేంద్రియ ఎరువులతో పంటల సాగు రైతులకు లాభదాయకంగా ఉంటుందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి సక్రియ నాయక్ సూచించారు. వీటి వల్ల కలిగే లాభాలను రైతులకు వివరించారు.
రసాయనాల వాడకంతో కలిగే నష్టాలు..
పంటల సాగులో విచక్షణరహితంగా బస్తాల కొద్దీ రసాయన ఎరువులను కుమ్మరించడంతో ఆ మందులను తట్టుకునే స్థాయి పంటలకు ఆశించే పురుగుకు పెరుగుతుంది. కాలక్రమేణ పురుగులు, తెగుళ్ల బెడద అధికమవుతుంది. మరోవైపు సాగు ఖర్చు విపరీతంగా పెరుగుతుంది. ఆహార ఉత్పత్తుల నాణ్యత తగ్గిపోతుంది. సరైన అవగాహన లేకుండా రసాయనాల వాడకం వల్ల వాటి అవశేషాలు నీటిలో, సాగు నేలలో కలిసి కలుషితమవుతాయి. మిత్ర కీటకాలు నశించి పర్యావరణంలో వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. వీటి నివారణ కోసం వ్యవసాయంలో పురుగు మందులు, రసాయనాలు లేకుండా చూసుకోవాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యవసాయ ఒప్పందాల ప్రకారం మార్కెట్‌లో పోటీకి మన ప్రాంత రైతులు నిలవాలంటే నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులకే ప్రాధాన్యం ఇవ్వాలి.
సేంద్రియ విధానం..
సాగులో లింగాకర్షన బుట్టలు వాడాలి. పరిమితులకు లోబడి బీటీ వైరస్ శిలీంధ్రాన్ని వాడాలి. అందుకు గంధకం, రాగి ఉత్పత్తులు వాడవచ్చు. వృక్ష సంబంధ నూనెలను కొన్ని జాగ్రత్తలతో వినియోగించవచ్చు. వేప సంబంధిత ఉత్పత్తులు, పచ్చిరొట్ట, వర్మీ కంపోస్టు ఎరువులపై దృష్టిపెట్టాలి. పంటల నుంచి వచ్చే బూడిద, జీవన ఎరువులు, జిప్సం పంటల్లో వాడుకోవచ్చు.
తక్కువ ఖర్చు..
జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తక్కువ ఖర్చుతో వ్యవసాయం చేసే దిశగా రైతులు అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించారు. వానపాములు, పశువులు, కోళ్ల ఎరువుతో పాటు పచ్చి ఆకులు, పిండి చెక్కలు వినియోగిస్తున్నారు. తద్వారా నాణ్యమైన, రుచికరమైన ఉత్పత్తులను పండించి దేశానికి అందించాల్సిన అవసరం ఉంది. వ్యవసాయశాఖ ద్వారా చిన్న, సన్నకారు రైతులకు సైతం అందుబాటులో ఉండే వర్మీ కంపోస్టు బెడ్స్‌ను రూ. 5వేల సబ్సిడీపై రైతులు పొందవచ్చు. వ్యవసాయశాఖ పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగు, జనుము, పిల్లి పెసర విత్తనాలను 5శాతం సబ్సిడీపై అందిస్తున్నారు.
పాడి–పంట
సేంద్రియ వ్యవసాయంతో లాభం
సేంద్రియ వ్యవసాయంతో లాభం


