ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మన ఇసుక వాహనం ద్వారా ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని కలెక్టర్ విజయేందిర ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని మీటింగ్‌హాల్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక సరఫరా రెండు పడక గదుల లబ్ధిదారులకు కేటాయింపు, రేషన్‌కార్డుల దరఖాస్తుల వెరిఫికేషన్, సీఎం ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం తదితర అంశాలను సమీక్షించారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం ఉచిత ఇసుక సరఫరా సంబంధిత పంచాయతీ కార్యదర్శి ధ్రువీకరించి తహసీల్దార్‌కు ఇసుక సరఫరా కేటాయింపు నివేదికను పంపించాలన్నారు. చిన్నచింతకుంట మండలంలోని నెల్లికొండి, చిన్నవడ్డెమాన్, అప్పంపల్లి, గూడూరు, ముసాపేట మండలంలోని పొల్కంపల్లి, అడ్డాకుల మండలం కన్మనూరు, పొన్నకల్, రాచర్ల రీచ్‌ల నుంచి ఉచిత ఇసుక సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. అక్రమ ఇసుక రవాణ అరికట్టేందుకు రెవె న్యూ, పోలీస్ అధికారులు సమన్వయంతో పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. ఫిల్టర్ ఇసుక తయారీ అరికట్టేందుకు గట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు. రేషన్‌కార్డులకు వచ్చిన దరఖాస్తును వెరిఫికేషన్ చేయాలన్నారు. అదనపు కలెక్టర్లు మోహన్‌రావు, ఏఎస్పీ రాములు, గనుల శాఖ ఏడీలు సంజయ్‌కుమార్, వెంకటరమణ, ఆర్‌డీఓ నవీన్, హౌజింగ్‌పీడీ వైద్యం భాస్కర్, సివిల్ సప్లయ్ అధికారి వెంకటేశ్ పాల్గొన్నారు.


