ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై అవగాహన కల్పించాలి
దేవరకద్ర: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం యూనిట్ కాస్ట్‌లో నిర్మించుకునే విధంగా లబ్ధిదారులకు అవగాహన కలిగించాలని గృహ నిర్మాణ శాఖ అధికారులకు కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. బుధవారం దేవరకద్ర మున్సిపాలిటీ పరిధిలోని మినుగోనిపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను కలెక్టర్ తనిఖీ చేశారు. గ్రామంలో ఐదు ఇళ్లు బేస్‌మెంట్ లెవల్ వరకు పూర్తికాగా, 14 ఇళ్లు మార్కింగ్ వేసినట్లు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా బేస్‌మెంట్ పూర్తయిన లబ్ధిదారురాలు మాసమ్మ ఇంటి వద్దకు కలెక్టర్ వెళ్లి పనులను పరిశీలించారు. బేస్‌మెంట్ కట్టడానికి ఎంతయిందని ఆమె ప్రశ్నించగా రూ.95 వేలు ఖర్చు అయినట్లు మాసమ్మ తెలిపింది. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ డిజైన్ ప్రకారం యూనిట్ కాస్ట్‌లో తక్కువ ఖర్చుతో ఇంటిని అందంగా కట్టుకోవచ్చని వివరించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఉచిత ఇసుక సరాఫరాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తహసీల్దార్‌ను ఆదేశించారు. గ్రామంలోని అంగన్‌వాడీ, ఆశావర్కర్లవి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని కలెక్టర్ అడిగారు. కలెక్టర్ పర్యటిస్తున్న సమయంలో అక్కడిి నుంచి వస్తున్న విద్యార్థులతో మాట్లాడారు. ఆమె వెంట గృహ నిర్మాణ పీడీ వైద్యం భాస్కర్, ఎల్‌డీఎం భాస్కర్, డీఆర్‌డీఓ నర్సింహులు, తహసీల్దార్ కృష్ణయ్య, ఎంపీడీఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ పోషకాహారం తీసుకోవాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం తీసుకోవాలని కలెక్టర్ విజయేందిర సూచించారు. బుధవారం తన చాంబర్‌లో పోషణ పక్షం వాల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోషణ పక్షంలో భాగంగా ఈ నెల 22 వరకు పోషణ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా పోషకాహార లోపం అధిగమించడానికి గ్రామస్థాయిలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ లబ్ధిదారులతో పాటు వారి కుటుంబసభ్యులు పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మోహన్‌రావు, మహిళ శిశు సంక్షేమాధికారి జరీనాబేగం, డీఎంహెచ్‌ఓ కృష్ణ, అదనపు డీఆర్‌డీఓ జోజప్ప తదితరులు పాల్గొన్నారు.


