పప్పుధాన్యల దిగుబడులు పెంచాలి
బిజినేపల్లి: ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్య సమాజ నిర్మాణానికి పప్పు దినుసులు, తృణధాన్యాల సాగు పెంచాలని ప్రొ. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకుడు డా. బలరాం కోరారు. వానాకాలం, యాసంగి సాగులో అతివృష్టి, అనావృష్టి, చీడపీడలను తట్టుకునే వంగడాలను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. మండలంలోని పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో బుధవారం రెండోరోజు జెడ్‌ఈఆర్‌ఏసీ సమావేశం జరగగా ఆయన పాల్గొని మాట్లాడారు. సేంద్రియ సాగు, సమగ్ర వ్యవసాయం, వాణిజ్య పంటల్లో దిగుబడుల పెంపు, చీడపీడల నివారణపై దృష్టి సారించాలని శాస్త్రవేత్తలకు సూచించారు. శాస్త్రవేత్తలు, అధికారులు పెద్ద రైతులను ఎంపిక చేసుకొని వారితో విప్లవాత్మక ప్రయోగాలు చేయించాలన్నారు. క్షేత్రస్థాయిలో రైతులకు నష్టం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని సరైన సూచనలు, సలహాలిస్తూ పంటల సాగులో దిగుబడుల్ని పెంచాలని కోరారు. రెండోరోజు ఆయా విభాగాల ప్రధాన శాస్త్రవేత్తలు, విస్తరణ శాస్త్రవేత్తలు, అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పంటల సాగులో వాతావరణ పరిస్థితులు, సస్యరక్షణ చర్యలు, సమగ్ర వ్యవసాయం, సాంకేతిక పద్ధతుల్లో విత్తనోత్పత్తి, విస్తరణ అంశాలు, చీడపీడలు, దిగుబడులు, నేలలు తదితర వాటిపై చర్చాగోష్ఠి నిర్వహించారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకుడు డా. ఎం.యాకాద్రి, ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీఆర్ డా. సుధాకర్, ప్రధాన శాస్త్రవేత్తలు, వ్యవసాయశాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.


