46 రోజులుగా శ్రమిస్తున్నారు..
అచ్చంపేట: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం లోపల సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సొరంగం పైకప్పు కూలిన ఘటన జరిగి మంగళవారం నాటికి 46 రోజులు గడవగా.. సొరంగం లోపల మట్టి, బురద, రాళ్లు, టీబీఎం బాగాల తొలగింపు పనులు వేగవంతమయ్యాయి. అలాగే ఎప్పటికప్పుడు వెంటిలేషన్ పనులు చేపడుతున్నారు. మంగళవారం రాత్రి షిఫ్ట్‌కు వెళ్లిన సహాయక సిబ్బంది కన్వేయర్ బెల్టు పొడిగింపు పనులు చేపడుతున్నారు. ప్రస్తుతం 13.730 కి.మీ., వరకు కన్వేయర్ బెల్టు ఉండగా మరో 70 మీటర్ల మేర దీనిని పొడిగించనున్నారు. ఈ నెల 11 వరకు నాలుగు రోజుల పాటు కన్వేయర్ బెల్టు పొడిగింపు పనులు కొనసాగనుండగా.. ఈ సమయంలో మట్టి, బురద బయటకు తరలించడం సాధ్యం కాదు. కన్వేయర్ బెల్టు పొడిగింపు ఇదే చివరి అవకాశంగా అధికారులు చెబుతున్నారు. తొలగించిన టీబీఎం బాగాలు, రాళ్లు, శిథిలాలను లోకో ట్రైన్ ప్లాట్‌ఫాం ద్వారా బయటకు తరలిస్తారు. మిగిలిన 70 మీటర్ల వరకు ఉన్న శిథిలాలను ఈ నెల 16 వరకు పూర్తి చేయాలనే లక్ష్యంతో సహాయక బృందాలు చర్యలు చేపడుతున్నాయి. సొరంగం పైకప్పు కూలిన 13.938 కి.మీ., ప్రదేశం అత్యంత ప్రమాదకరమైనదిగా నిర్ధారించి 45 మీటర్ల వరకు కంచె ఏర్పాటు చేశారు. అక్కడ తవ్వకాలు చేపట్టే అవకాశం లేకపోవడంతో మిగిలిన 70 మీటర్ల వరకు ఉన్న మట్టి, బురద, రాళ్లు, టీబీఎం బాగాలను తొలగించే ప్రక్రియ కొనసాగిస్తున్నారు.
వెంటిలేషన్ కొనసాగింపు..
సొరంగం లోపల మట్టి తవ్వకాలకు అనుగుణంగా వెంటిలేషన్ పనులు కొనసాగిస్తున్నారని ప్రత్యేకాధికారి శివశంకర్ లోతేటి అన్నారు. మంగళవారం ఎస్‌ఎల్‌బీసీ సొరంగం వద్ద జేపీ కార్యాలయంలో సహాయక బృందాల ఉన్నతాధికారులతో సమీక్షా నిర్వహించి సహాయక చర్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాద ప్రదేశంలో ఎలాంటి చర్యలు చేపట్టకుండా మిగిలిన ప్రదేశంలో సహాయక చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఐదు ఎస్కవేటర్ల సహాయంతో మట్టి తవ్వకాలు చేపడుతూ కన్వేయర్ బెల్టు ద్వారా మట్టి బయటకు తరలిస్తున్నామని చెప్పారు. సొరంగంలో నిరంతరాయంగా వస్తున్న నీటి ఊటను అత్యధిక సామర్థ్యం కలిగిన పంపుల ద్వారా బయటకు పంపింగ్ చేస్తున్నామన్నారు.
మరోసారి కన్వేయర్ బెల్టు పొడిగింపు పనులు ప్రారంభం
ఈ నెల 16 వరకు 70 మీటర్ల శిథిలాలు తొలగించేలా ముందుకు..
ఎస్‌ఎల్‌బీసీలో ముమ్మరంగా సహాయక చర్యలు


