వంట గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): పెంచిన వంట గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని భారత మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి పద్మావతి డిమాండ్ చేశారు. మంగళవారం పట్టణంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఓ వైపు నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యుడు బతకలేని స్థాయిలో ఉంటే మరోవైపు గ్యాస్ ధరలు పెంచడం ఏమిటని ప్రశ్నించారు. పేదలకు అందించే ఉజ్వల గ్యాస్ సిలిండర్‌పై కూడా రూ.50 పెంపు మోయలేని భారమేనన్నారు. అంబానీ, అదానీలకు ఆదాయం కట్టబెట్టడానికే ధరల పెంపని తేట తెల్లమవుతుందని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు పడిపోతే.. దేశంలో మాత్రమే పెరిగిందని సాకు చూపుతూ ధరల పెంపు ఏ మాత్రం సమంజసం కాదన్నారు. కార్యక్రమంలో వనపర్తి జిల్లా కార్యదర్శి గీత, కమిటీ సభ్యులు మాధవి, సత్యమ్మ, సింధు, పద్మ, మహిళలు పాల్గొన్నారు.


