వేసవి శిబిరాల నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం
మహబూబ్‌నగర్ క్రీడలు: రాష్ట్ర క్రీడాప్రాధికారిక సంస్థ, జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో వచ్చేనెల 1 నుంచి 31వ తేదీ వరకు వివిధ క్రీడాంశాల్లో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నట్లు డీవైఎస్‌ఓ ఎస్.శ్రీనివాస్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. క్రీడా శిక్షణా శిబిరాల ను నిర్వహించేందుకు వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్ క్రీడాకారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. సీనియర్ క్రీడాకారులైతే కనీసం జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని ఉండాలని తెలిపారు. ఆసక్తిగలవారు తమ దరఖాస్తులను ఈనెల 22వ తేదీ వరకు జిల్లాకేంద్రంలోని యువజన, క్రీడాశాఖ కార్యాలయంలో వ్యక్తిగతంగా లేదా పోస్టు ద్వారా అందజేయాలని కోరారు. మిగతా వివరాల కోసం 9440656162, 9912564056 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
సరైన ఆహారంతోనే ఆరోగ్యం కాపాడుకోవాలి
పాలమూరు: ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవడంతో పాటు సరైన ఆహారం తీసుకోవడం వల్ల జీవన ప్రమాణం పెరుగుతుందని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ కృష్ణ అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో సోమవారం ఎదిర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దగ్గర ఏర్పాటు చేసిన ర్యాలీని డీఎంహెచ్‌ఓ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది ఆరోగ్యకరమైన ఆరంభాలు–ఆశాజనక భవితవ్యాలు అనే అంశంపై అవగాహన పెంచాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తుందని తెలిపారు. తల్లి గర్భంలో ఉండే శిశువు దగ్గరి నుంచి పుట్టిన శిశువు వరకు ఆరోగ్యంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తల్లిదండ్రులకు తెలియ చెప్పాలన్నారు. నవజాత శిశువులకు తప్పక టీకాలు ఇప్పించాలని, పరిశుభ్రత, పోషకాహారం, ఎదుగుదల వంటి అంశాలపై వివరించాలన్నారు. దీర్ఘకాలిక రోగాల బారినపడకుండా ఉండటానికి ఆకుకూరలు, తాజా పండ్లు వంటివి అధికంగా తీసుకోవాలన్నారు. ప్రధానంగా నిత్యం వాకింగ్ చేయడం వల్ల కొత్త రోగాలు శరీరంలోకి వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందన్నారు. అనంతరం క్షయ బాధితులకు పోషక కిట్లను అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్ భాస్కర్ నాయక్, మంజుల, శరత్‌చంద్ర, ప్రవీణ్, రాజగోపాలచారి పాల్గొన్నారు.
సమతుల్య ఆహారంతో సంపూర్ణ ఆరోగ్యం
జడ్చర్ల: సమతుల్య ఆహారంతో సంపూర్ణ ఆరోగ్యం పొందే అవకాశం ఉందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం స్థానిక సీనియర్ సిటిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీనియర్ సిటిజన్లు ఆరోగ్యంగా ఉండేందుకు పౌష్టికాహారంతో పాటు యోగా, వాకింగ్ అలవర్చుకోవాలని సూచించారు. ఎప్పటికప్పడు వైద్య పరీక్షలు చేయించుకుంటూ వైద్యుల సలహాలు తీసుకుంటూ కుటుంబసభ్యులు, స్నేహితులు, ఆత్మీయులతో కలిసి ఆహ్లాదకరంగా జీవితాన్ని గడపాలని కోరారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి ఇందిర, జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ సంపత్‌కుమార్, డాక్టర్ శ్వేత,డాక్టర్ సౌమ్య, పాల్గొన్నారు.
అండర్–19 క్రికెట్
చాంపియన్‌షిప్ రద్దు?
మహబూబ్‌నగర్ క్రీడలు: అండర్–19 క్రికెట్ చాంపియన్‌షిప్ రద్దయినట్లు సమాచారం. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ ఎస్‌జీఎఫ్ అండర్–19 బాలుర క్రికెట్ చాంపియన్‌షిప్‌ను మహబూబ్‌నగర్‌లో ఈనెల 25వ తేదీ నుంచి 29 వరకు నిర్వహించేలా నిర్ణయించారు. అయితే అనివార్య కారణాల వల్ల టోర్నీని రద్దు చేస్తూ ఎస్‌జీఎఫ్‌ఐ సీఈఓ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది.
జిల్లాకేంద్రంలో వర్షం
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: జిల్లాకేంద్రంలో సోమవారం మధ్యాహ్నం అరగంట పాటు ఓ మోస్తరు వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎండ.. ఉక్కపోతతో జనం అల్లాడిపోయారు. ఒక్కసారిగా వర్షం రావడంతో వాతావరణం చల్లబడింది. కొన్ని ప్రాంతాల్లో వడగండ్లు పడ్డాయి.
వేసవి శిబిరాల నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం


