లభించని ఆరుగురి ఆచూకీ
అచ్చంపేట: ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో ప్రమాదానికి గురైన కార్మికుల ఆచూకీ కోసం 44 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. సొరంగం పైకప్పు కూలిన ఘటనలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకోగా.. ఇద్దరి మృతదేహాలను వెలికి తీసిన విషయం తెలిసిందే. మిగతా ఆరుగురి ఆచూకీ కోసం అన్వేషణ కొనసాగుతూనే ఉంది. జీఎస్‌ఐ, నీటిపారుదలశాఖ అధికారులు సొరంగ ప్రదేశం వద్ద ఉంటూ సహాయక సిబ్బందికి అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తున్నారు. అయితే సొరంగంలో ఎస్కవేటర్లు, సహాయక సిబ్బంది సేవలే ప్రధానంగా ఉపయోగపడుతున్నాయి. సింగరేణి మైన్స్ రెస్క్యూ, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎప్, ర్యాట్ హోల్ మైనర్స్, దక్షిణమధ్య రైల్వే, ఆర్మీ, హైడ్రా వంటి 12 రకాల సహాయక బృందాలు నిరంతరాయంగా పనిచేస్తున్నాయి. వీటికి తోడు ఐదు ఎస్కవేటర్లతో మట్టి, రాళ్లు, బురద, టీబీఎం భాగాలను తొలగించే పనులను ముమ్మరం చేశారు.
రోజుకు 20 మీటర్ల మట్టి తొలగింపు..
సొరంగం లోపల పైకప్పు కూలిన ప్రదేశంలో రోజు 20 మీటర్ల మేర మట్టిని తొలగిస్తున్నారు. తవ్విన మట్టి, బురద, రాళ్లను కన్వేయర్ బెల్టు ద్వారా, టీబీఎం భాగాలను లోకో ట్రైన్ ద్వారా బయటకు పంపిస్తున్నారు. సొరంగం కూలిన ప్రదేశంలో సహాయక చర్యలకు ఆటంకంగా మారిన నీటి ఊటను ఎప్పటికప్పుడు బయటకు పంపింగ్ చేస్తున్నారు. నిమిషానికి 10వేల లీటర్ల చొప్పున వస్తున్న నీటి ఊటను 150 హెచ్‌పీ మోటార్ల సహాయంతో తోడేస్తున్నారు.
ఎస్‌ఎల్‌బీసీలో 44 రోజులుగా
కొనసాగుతున్న సహాయక చర్యలు
లభించని ఆరుగురి ఆచూకీ


