రేపు హైందవ భక్తి కళా సమ్మేళనం
మహబూబ్‌నగర్ రూరల్: సంకీర్తన సాంప్రదాయమే సనాతన ధర్మానికి ఊపిరనే లక్ష్యంతో సోమవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద హైందవ భక్త కళా సమ్మేళనం నిర్వహించనున్నామని.. భజన కళాకారులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయశంకర స్వామిజీ కోరారు. శనివారం మన్యంకొండ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఉమ్మడి పాలమూరు జిల్లా భజన కళాబృందం గురువులు, ప్రతినిధుల హరినామ సంకీర్తనకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై సమ్మేళనానికి సంబంధించిన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగా యాదాద్రి లక్ష్మీ నారసింహస్వామి ఆలయ సన్నిధిలో నిత్య అఖండ హరినామ సంకీర్తన జరిపించాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామాల్లో వేల సంఖ్యలో జానపద, భజన కళాబృందాలు, కళాకారులు ఉన్నారని.. హరినామ సంకీర్తనలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారని వివరించారు. భజన గురువులకు గుర్తింపు కార్డులిచ్చి కళారంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు, దేవాదాయశాఖ ముందుకురావాలని కోరారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగుళాంబ గద్వాల, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల కళాకారులు రెండుగంటల పాటు ఆలపించిన భక్తిగీతాలు ఆకట్టుకున్నాయి. సంకీర్తన అనంతరం స్వామివారిని దర్శించుకొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఆలయ చైర్మన్ అళహరి మధుసూదన్‌కుమార్ సంకీర్తనలో పాల్గొన్న భజన గురువులను అభినందించారు. ప్రత్యేక దినాలు, ఉత్సవాల సమయంలో భజన గురువులు పాల్గొని హనుమద్దాసుని సంకీర్తన చేయాలని కోరారు. కార్యక్రమంమలో హిందూ ఫర్ ఫ్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ ప్రతినిధి మల్లికా వల్లభ, జై భారత్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి రాజు తదితరులు పాల్గొన్నారు.


