చారకొండ: రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన సిర్సనగండ్ల సీతారామచంద్రస్వాముల బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి 11వ తేదీ వరకు వారం పాటు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ పుణ్యక్షేత్రం నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ మండలం సిర్సనగండ్ల గ్రామపంచాయతీ పరిధిలోని అయోధ్యనగర్ (గుట్ట)పైన 300 అడుగుల ఎతైన ఏకశిలపై సుమారు 60 ఎకరాల్లో ఉంది. బ్రహ్మోత్సవాలకు ఉమ్మడి జిల్లాతో పాటు రంగారెడ్డి, నల్గొండ, హైదరాబాద్ తదితర జిల్లాల నుంచి లక్షలాది మంది భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకొని మొక్కు లు తీర్చుకుంటారు. శ్రీరామనవమి రోజున భద్రాచలం మాదిరిగానే ఇక్కడ కూడా ప్రభుత్వ లాంఛనాలతో సీతారాముల కల్యాణం జరగనుంది.
ఆలయ చరిత్ర..
సిర్సనగండ్ల గుట్టపై సీతారామచంద్రస్వామి ఆలయం ఏర్పడకముందే ముక్కిడి పోచమ్మ, దత్తాత్రేయ దేవాలయాలు ఉండేవని.. గ్రామానికి చెందిన ఢేరం రామయాజ్వీ నిత్యం పోచమ్మకు పూజలు చేసి అనంతరం దత్తాత్రేయ దేవాలయంలో తపస్సు చేసేవాడని చరిత్ర చెబుతోంది. ఒకరోజు అతనికి కలలో స్వామివారు దర్శనమిచ్చి ఖమ్మం జిల్లా పాల్వంచ రావిచేడు గ్రామంలో భాస్కరుడు అనే బ్రహ్మణుడి ఇంటి పేరటిలో కాకార పాదుకింద విగ్రహాలు ఉన్నాయని.. తీసుకొచ్చి రోకలి శబ్ధం కూడా వినిపించని పవిత్ర స్థలం సిర్సనగండ్ల గుట్టపై ప్రతిష్టించాలని చెప్పారని ప్రతీతి. ఆయనతో పాటు గ్రామపెద్దలు ఎద్దుల బండ్లపై అక్కడికి వెళ్లి రాజుగారికి వివరించి భటులతో కలిసి కాకరపాదులో తవ్వగా సీతారామచంద్రస్వామి, లక్ష్మణుడు, ఆంజనేయస్వామి విగ్రహాలు బయటపడ్డాయని.. వాటిని తీసుకొస్తుండగా గ్రామస్తులు అడ్డుకోవడంతో ఆంజనేయస్వామి విగ్రహాన్ని అప్పజెప్పి సీతారామ లక్ష్మణుల విగ్రహాలు తీసుకొచ్చారని పెద్దలు చెబుతారు. వాటిని గుట్టపై ప్రతిష్టించే సమయంలో పోచమ్మ తల్లి ప్రత్యక్షమై వద్దని చెప్పడంతో సీతారామచంద్రస్వామి ప్రత్యక్షమై అమ్మవారిని శాంతించి భక్తులు నీ దర్శనం చేసుకున్న తర్వాతే మమ్ముల్ని దర్శించుకుంటారని అభయం ఇవ్వడంతో అభయ రాముడిగా, క్షత్రీయ వంశానికి చెందినవారు కావడంతో రాజా రాముడిగా భక్తులకు దర్శనమిస్తున్నారని పురాణాలు చెబుతున్నాయి. నైరుతి భాగంలో పోచమ్మతల్లి, తూర్పుదిశలో సీతారామచంద్రస్వామి నిత్యం భక్తులకు దర్శనమిస్తున్నారు. 14వ శతాబ్దంలో రాచకొండ పద్మనాయకుల కాలంలో ఆలయాన్ని నిర్మించినట్లు దేవాలయంలోని ఒక స్తంభంపై అప్పటి లిపిలో చెక్కినట్లు నేటికీ ఆనవాళ్లు కనిపిస్తున్నాయి.
ప్రత్యేక బస్సులు..
బ్రహ్మోత్సవాలకు మహబూబ్‌నగర్, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం కల్వకుర్తి, అచ్చంపేట, దేవరకొండ నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నారు.
నేటి నుంచి 11వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు
ఏకశిలపై వెలిసిన సీతారామచంద్రస్వామి దేవాలయం
ప్రభుత్వ లాంఛనాలతో సీతారాముల కల్యాణం
ఏర్పాట్లు పూర్తిచేసిన పాలక వర్గం
కార్యక్రమాలు ఇలా..
మొదటిరోజు శనివారం మధ్యాహ్నం మాస కల్యాణం
ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు కల్యాణం
సోమవారం ఉదయం కుంకుమార్చన, రాత్రి చిన్న రథం (పూల తేరు)
మంగళవారం శివదత్తాత్రేయ పరశురామ, పోచమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు
బుధవారం ప్రత్యేక పూజలు, రాత్రి పెద్ద తేరు (రథోత్సవం)
గురువారం పల్లకీసేవ, ఏకాంతసేవ తదితర కార్యక్రమాలు ఉంటాయని ఆలయ చైర్మన్ ఢేరం రామశర్మ, ఈఓ స్వర్గం ఆంజనేయులు తెలిపారు.
వెండి కిరీటం బహూకరణ
సిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి ఆలయంలోని సీతమ్మ తల్లికి శుక్రవారం చారకొండ గ్రామానికి చెందిన బొడ్డు స్వాతి, నవీన్ దంపతులు రూ.40 వేల విలువైన 40 తులాల వెండి కిరీటాన్ని బహూకరించారు.
అపర భద్రాద్రి సిర్సనగండ్ల
అపర భద్రాద్రి సిర్సనగండ్ల


