బాలల సంరక్షణపై నిర్లక్ష్యం వీడాలి
● జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఇందిర
హన్వాడ: బాలల సంరక్షణపై నిర్లక్ష్యం వీడాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఇందిర అన్నారు. గురువారం స్థానిక కేజీబీవీలో చైల్డ్ ఫ్రెండ్లీ కమిటీ ఆధ్వర్యంలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి బాల్యవివాహాల నివారణ, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలల చట్టాలపై పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ఉచిత న్యాయ సహాయంతో పాటు బాలలు, మహిళలకు ప్రాథమిక హక్కులను తెలియజేసేందుకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ పని చేస్తుందన్నారు. బాలలు ఏదైనా సమస్య వస్తే 1098కు ఫోన్ చేయాలని సూచించారు. తహసీల్దార్ కిష్ట్యనాయక్, పారా లీగల్ వలంటీర్ యాదయ్య, నాగభూషణం, శివన్న పాల్గొన్నారు.
బ్యాంకింగ్, ఫైనాన్స్‌లో ఉచిత శిక్షణ
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగ బీసీ యువతకు స్కూల్ ఆఫ్ బ్యాకింగ్ అండ్ ఫైనాన్స్ శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా ఎంప్లాయిమెంట్ శాఖ అధికారి మైత్రి ప్రియ గురువారంఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 8వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, ఈ నెల 12వ తేదీన ఉమ్మడి జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో ఆన్‌లైన్ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇతర సమాచారం కోసం 040–29303130 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
పదోన్నతి పొందినఉపాధ్యాయులకు శిక్షణ
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇటీవల ఎస్జీటీల నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందిన ఉపాధ్యాయులకు జిల్లాకేంద్రంలోని డైట్ కళాశాలలో శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలను పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ఇటీవల పాఠశాలల్లో ఏఐ ఆధారిత కంప్యూటర్‌లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చామని, వాటిని కూడా విద్యార్థులకు పూర్తిస్థాయిలో వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రీసోర్స్‌పర్సన్లు చక్రవర్తి గౌడ్, గిరిజారమణ, బాలుయాదవ్, దుంకుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపు
● తనిఖీ చేసి.. ఫేక్ మెసేజ్ అని తేల్చిన పోలీసులు
నాగర్‌కర్నూల్: జిల్లా కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపు మెసేజ్ రావడం కలకలం రేగింది. గురు వారం ఉదయం 7:24 గంటలకు జిల్లా కలెక్టర్ మెయిల్‌కు ఈడీ బేస్డ్ పైప్ బాంబ్‌తో సాయంత్రం 3.20 గంటలకు కలెక్టర్ కార్యాలయాన్ని పేల్చేస్తామని మెసేజ్ వచ్చింది. ప్రతి రోజు ఉద్యోగులు వచ్చిన వెంటనే కలెక్టర్‌కు వచ్చిన మెయిల్స్ చెక్ చేయడం సర్వసాధారణం. కాగా గురువారం వచ్చిన ఈ బెదిరింపు మెసేజ్‌ను గమనించిన సెక్షన్ ఉద్యోగులు విషయాన్ని కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే అప్రమత్తమైన ఏఓ ఈ విషయాన్ని ఉదయం 11 గంటలకు ఎస్పీ వైభవ్ గైక్వాడ్, అదనపు ఎస్పీ రామేశ్వర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నాగర్‌కర్నూల్ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ కనకయ్యలు బాంబ్‌స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లతో అక్కడికి చేరుకొని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. బాంబుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు, ఆనవాళ్లు లేకపోవడంతో ఫేక్ మెసేజ్‌గా పోలీసులు తేల్చారు. అయితే ముప్పల లక్ష్మణ్‌రావు పేరుతో వచ్చిన ఈ మెసే జ్ చివరి అల్లాహూ అక్బర్ అని రాయడం గమ నార్హం. బాంబు బెదిరింపు రావడంతో ఉద్యోగులు సైతం బయటికి వెళ్లిపోయారు.
విచారణ చేస్తున్నాం: శ్రీనివాసులు, డీఎస్పీ
కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపు విషయంలో విచారణ చేస్తున్నాం. ఇది ఫేక్ మెసేజే. కలెక్టరేట్‌లో తనిఖీలు కూడా చేపట్టాం. మెయిల్ ఐడీ ఎక్కడి నుంచే వచ్చిందనే విషయం కనుగోనేందుకు ఐపీ అడ్రస్ కోసం ఐటీ సిబ్బంది ద్వారా విచారణ చేస్తున్నాం.
బాలల సంరక్షణపై నిర్లక్ష్యం వీడాలి


