బోరు మోటారు సరిచేస్తుండగా ఇద్దరు యువ రైతులు..
అచ్చంపేట రూరల్: వ్యవసాయ పొలంలోని పాంపాండ్‌లో ఉన్న బోరు మోటారును సరిచేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై ఇద్దరు యువరైతులు మృతి చెందారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలోని చేదురుబావితండాకు చెందిన కాట్రావత్ లోక అలియాస్ లోకేష్(30) తన వ్యవసాయ పొలంలో (పాంపాండ్) బోరు మోటారు రెండు రోజుల నుంచి పనిచేయడం లేదు. దీంతో సమీప పొలంలోని ముడావత్ కుమార్(28) విషయం చెప్పి బుధవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో సాయంగా తీసుకెళ్లాడు. బోరు మోటారు సరి చేస్తుండగా.. ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందారు. ఇద్దరు యువ రైతులు పొలం వద్ద మృతి చెందిన సంఘటన ఎవరికీ తెలియలేదు. బుధవారం సాయంత్రం అయినా ఇళ్లకు తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబీకులు.. అర్ధరాత్రి వరకు ఇద్దరికి ఫోన్ చేయగా రింగ్ అయినప్పటికీ ఎత్తలేదు. దీంతో కుటుంబసభ్యులు, తండావాసులు తండా, చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. గురువారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో లోకేష్ పొలం వద్ద ఓ చెట్టు కింద బైక్‌ను గమనించారు. అక్కడికి వెళ్లిన కొందరు ఫోన్ చేయగా పాంపాండ్ వద్ద సెల్‌ఫోన్ రింగ్ కాగా అక్కడికి వెళ్లి చూడగా ఇద్దరూ శవమై కనిపించారు. దీంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. పాంపాండ్ నుంచి ఇద్దరి మృతదేహాలను తండాకు తరలించారు. ఈ ఘటనపై లోక తండ్రి హన్యా ఫిర్యాదు మేరకు సిద్దాపూర్ ఎస్‌ఐ పవన్‌కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలకు అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. లోకకు భార్య సరితతోపాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. అలాగే కుమార్‌కు భార్య వినోజితో పాటు కుమార్తె, కుమారుడు ఉన్నారు. బాధిత కుటుం సభ్యులను పలువురు నాయకులు పరామర్శించారు.


