సహాయక చర్యలు వేగవంతం
అచ్చంపేట: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగంలో ప్రమాదం జరిగి 41 రోజులు అవుతున్నా.. ఇంకా ఆరుగురు కార్మికుల జాడ లభించలేదు. ప్రమాదంలో రూ.కోట్ల విలువైన టీబీఎం ధ్వంసం కావడంతో పాటు ఎనిమిది మంది కార్మికులు గల్లంతయ్యారు. ఇప్పటి వరకు ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. సొరంగంలో చిక్కుకున్న వారి ఆచూకీ కనుగొనేందుకు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. కన్వేయర్ బెల్టు పొడిగింపు, వెంటిలేషన్ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. ఆర్మీకి చెందిన బాబ్‌కాట్ మెషిన్లు, నాలుగు ఎస్కవేటర్లతో మట్టిని తొలగించి కన్వేయర్ బెల్టు ద్వారా బయటకు తరలిస్తున్నారు. నిమిషానికి 10 వేల లీటర్ల నీటి ఊటను 150 హెచ్‌పీ మోటార్ల సాయంతో బయటకు పంపుతున్నారు.
15 రోజుల్లో పూర్తయ్యేనా..
సొరంగంలో కూరుకుపోయిన టీబీఎం శకలాలు, మట్టి, బురద, రాళ్లు ఇతర శిథిలాల తొలగింపు 15 రోజుల్లో పూర్తవుతుందని ప్రభుత్వం గడువు విధించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 560 మంది సహాయక సిబ్బంది మూడు, ఐదు షిఫ్టుల్లో పనిచేస్తున్నారు. అత్యంత క్లిష్టమైన డీ1, డీ2 ప్రదేశంలోని 30 మీటర్ల వరకు శిథిలాలను తొలగించారు. మరో 110 మీటర్ల మేర మట్టి, బురద, రాళ్లను తొలగిస్తే కార్మికుల ఆచూకీ లభ్యమయ్యే అవకాశం ఉందని సహాయక సిబ్బంది చెబుతున్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన గడువులోగా పనులు పూర్తవడం గగనమే అనిపిస్తోంది.
ఎస్‌ఎల్‌బీసీలో కార్మికుల కోసం
41 రోజులుగా గాలింపు


