మహబూబ్‌నగర్ క్రైం: రంజాన్ పండగ సందర్భంగా సోమవారం జిల్లాకేంద్రంలోని వానగుట్ట సమీపంలో ఉన్న ఈద్గాను ఎస్పీ జానకి సందర్శించి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. స్థానికంగా విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందికి సూచనలు చేశారు. శాంతిభద్రతలతోపాటు ట్రాఫిక్ సమస్యలు రాకుండా చూడాలన్నారు. జిల్లాలో పండగ ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకోవడానికి పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
ప్రజల రద్దీని దృష్టిలో పెట్టుకుని సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేశామన్నారు. ఈద్గా, మసీదులు, ప్రధాన చౌరస్తాలలో అదనపు సిబ్బంది విధుల్లో ఉన్నారన్నారు. ప్రతిఒక్కరూ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని, ఎలాంటి సమస్య ఉన్న డయల్ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఏఎస్పీలు రాములు, సురేష్‌కుమార్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి, సీఐలు వెంకటేష్, ఇజాజుద్దీన్ పాల్గొన్నారు.
నేషనల్ హ్యాండ్‌బాల్ పోటీలకు గిరిజ
మహబూబ్‌నగర్ క్రీడలు: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హత్రాస్‌లో సోమవారం నుంచి ప్రారంభమైన సీనియర్ మహిళా జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు జిల్లాకు చెందిన క్రీడాకారిణి కె.గిరిజ ఎంపికయ్యారు. తెలంగాణ మహిళా జట్టులో ఆమె చోటు దక్కించుకున్నారు. క్రీడాకారిణి ఎంపికపై సంఘం సభ్యులు రజనికాంత్‌రెడ్డి, ఎండీ జియావుద్దీన్, ప్రదీప్‌కుమార్ హర్షం వ్యక్తం చేశారు. జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభచాటి జిల్లాకు పేరు, ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఉత్తరాది మఠంలోపీఠాధిపతి పూజలు
స్టేషన్ మహబూబ్‌నగర్: జిల్లా కేంద్రం ప్రమోదగిరిలోని ఉత్తరాది మఠంలో సోమవారం పీఠాధిపతులు శ్రీసత్యాత్మతీర్థ శ్రీపాదుల వారు శ్రీవేంకటేశ్వరస్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి అభిషేకం, మూల రామచంద్రస్వామికి పూజలు, మహాభారత తాత్పర్య నిర్ణయ మంగళ మహోత్సవ పూజలు నిర్వహించారు. నెలరోజుల నుంచి మహాభారత ప్రవచనం చేసిన ఆనందాచార్యులను అభినందించారు.


