ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలి
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: విశ్వావసు నామ సంవత్సరంలో ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని శిల్పారామంలో మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలతోపాటు పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరి ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలని ఆశాభావం వ్యక్తం చేశారు. నగరంలో ఏ వేడుకలైనా భక్తిశ్రద్ధలతో, సోదరభావంతో కలసిమెలసి జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం వివిధ రంగాల్లో ఉత్తమ సేవలు అందించిన 12 మందిని ఘనంగా సన్మానించారు. వీరిలో మనోహర్‌రెడ్డి (న్యాయవాది), లయన్ నటరాజ్ (రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్), డా.శామ్యూల్ (వైస్ చైర్మన్), పాండురంగం (యోగా గురువు), చెన్నవీరయ్య (రిటైర్డ్ పీడీ), నాయిని భాగన్నగౌడ్ (స్వరలహరి కల్చరల్ అకాడమీ కార్యదర్శి), శ్రీనయ్యశెట్టి (రిటైర్డ్ ప్రిన్సిపాల్), రామచందర్ నాయక్ (రిటైర్డ్ పీడీ), సిర్రా నారాయణ (రిటైర్డ్ టీచర్), రఫీఅహ్మద్ పటేల్ (క్వామీ ఏక్తా కమిటీ వ్యవస్థాపకుడు), డా.మురళీధర్‌రావు (వైద్యుడు), వేణుగోపాల్ (జర్నలిస్టు) ఉన్నారు. కార్యక్రమంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు మల్లు నర్సింహారెడ్డి, ముడా చైర్మన్ కె.లక్ష్మణ్‌యాదవ్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్‌కుమార్‌గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ బెక్కరి అనిత, నాయకులు ఎన్‌పీ వెంకటేశ్, సంజీవ్ ముదిరాజ్, సత్తూర్ చంద్రకుమార్‌గౌడ్, సిరాజ్‌ఖాద్రీ, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డి.మహేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


