బలహీనవర్గాల పక్షాన పోరాడుతా
నాగర్‌కర్నూల్: బలహీనవర్గాల అభ్యున్నతికి ఎంతైనా పోరాడుతానని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని తీగల వెంకటస్వామి ఫంక్షన్ హాల్‌లో ఓం శ్రీ సాయిరాం ఫైనాన్స్ బాధితులు నిర్వహించిన సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వివిధ వర్గాల ప్రజలకు చెందిన దాదాపు రూ.150 కోట్ల వరకు మోసం జరిగిందని.. బాధితులందరికీ న్యాయం చేయాలని కోరారు. ఫైనాన్స్ కంపెనీకి ఏప్రిల్ 8 వరకు డెడ్‌లైన్ విధిస్తున్నానని.. ఆలోపు బాధితులకు డబ్బులు చెల్లించకపోతే అసలైన యుద్ధం ఎలా ఉంటుందో చూస్తారని హెచ్చరించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేష్‌రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి స్పందించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. అంతకుముందు కొందరు బాధితులు ఫైనాన్స్ మోసం చేసిన తీరును ఆయనకు వివరించారు. అనంతరం ఆయనే బాధితుల వద్దకు వెళ్లి ఎవరెవరికి ఎంత డబ్బు రావాలో అడిగి రాసుకున్నారు. బాధితుల తరఫున నిలబడి డబ్బులు తిరిగి ఇప్పిస్తానని భరోసానిచ్చారు. కార్యక్రమంలో జిల్లాలోని తీన్మార్ మల్లన్న బృందం పాల్గొంది.
బాధితుల తరఫున మాట్లాడొద్దన్నారు..
శ్రీసాయిరం ఫైనాన్స్ సంస్థ చేతిలో మోసపోయిన బాధితులకు అండగా ఉండాల్సిన ఎమ్మెల్యేలు, ఎంపీలు కనీసం మాట్లాడడం లేదని తీన్మార్ మల్లన్న విమర్శించారు. పైగా బాధితుల తరఫున సమావేశం పెట్టవద్దని ఓ మంత్రి ఫోన్‌చేసి మరీ చెప్పారని సంచలన ఆరోపణలు చేశారు. పత్రికల్లో, టీవీల్లో కూడా పెద్దోళ్ల వార్తలు వస్తాయే గానీ పేదోళ్ల వార్తలు రావని తెలిపారు. దొంగతనం చేసింది, ఫైనాన్స్ పేరుతో పొమ్ము ఎత్తుకెళ్లింది కూడా పెద్దలేనని అన్నారు. మల్లన్న ఇక్కడ మీటింగ్ పెడితే పరేషాన్ అయితదని మంత్రి సమావేశం పెట్టవద్దని అంటున్నారని తెలిపారు.
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న


