
జోరుగా ఉల్లి వ్యాపారం
నిలకడగా ధరలు..
దేవరకద్ర మార్కెట్‌లో బుధవారం జరిగిన వేలంలో ఉల్లి ధరలు నిలకడగానే ఉన్నాయి. రెండు వారాలుగా దిగివచ్చిన ధరలే ఈ వారం వచ్చాయి. ఉదయం 10 గంటలకే ఉల్లి వేలం ప్రారంభం కాగా.. క్వింటాల్ ఉల్లి గరిష్టంగా రూ. 2,000 నుంచి రూ. 1,800 వరకు పలికింది. కనిష్టంగా రూ. 1,000 నుంచి రూ. 1,600 ధర వచ్చింది. అయితే గరిష్ట , కనిష్ట ధరలు అటు, ఇటుగా రావడంతో వ్యాపారులు ఏ కుప్పకు ఆ కుప్పకు బస్తా ధర నిర్ణయించి అమ్మకాలు సాగించారు. మార్కెట్ నిబంధనలు సడలించిన తర్వాత ఉల్లి బస్తా 50 కేజీలుగా నిర్ణయించారు. ఒక్కో బస్తా గరిష్టంగా రూ. 1,000 నుంచి రూ. 900 వరకు విక్రయించగా.. కనిష్టంగా రూ. 800 నుంచి రూ. 500 వరకు అమ్మకాలు సాగించారు.
ఉల్లి కుప్పలతో నిండిన దేవరకద్ర మార్కెట్
దేవరకద్ర: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఉల్లి వ్యాపారానికి కేంద్ర బిందువుగా మారింది దేవరకద్ర మార్కెట్. ప్రతి బుధవారం జరిగే ఉల్లి బహిరంగ వేలానికి జిల్లా నలుమూలల నుంచి వ్యాపారులు తరలివస్తున్నారు. ఉల్లి వ్యాపారంతో మార్కెట్ కళకళలాడుతుంది. సీజన్‌లో 5వేల నుంచి 10వేల బస్తాల ఉల్లి ఇక్కడికి అమ్మకానికి వస్తుంది. మార్కెట్ ఆవరణ మొత్తం ఉల్లి కుప్పలతో నిండిపోతుంది. ఉమ్మడి జిల్లాలోని నాగర్‌కర్నూల్, వనపర్తి, జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల, నారాయణపేట, ఆత్మకూర్, మక్తల్, అచ్చంపేట, కల్వకుర్తి ప్రాంతాలకు చెందిన వ్యాపారులు బహిరంగ వేలంలో పాల్గొని కొనుగోలు చేస్తారు. మరికొందరు రైతులతో నేరుగా కొంటున్నారు. బహిరంగంగానే ఉల్లికి ధర నిర్ణయించడంతో ఇటు రైతులకు లాభం చేకూరుతోంది. ప్రతి ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఉల్లి సీజన్ ఉంటుంది.
10వేల బస్తాల రాక..
మార్కెట్‌కు దాదాపు 10వేల బస్తాల ఉల్లి అమ్మకానికి వచ్చింది. మార్కెట్‌లో దాదాపు 40 ట్రేడింగ్ షాపులు ఉండగా.. మధ్యాహ్నం వరకు కేవలం 5 షాపుల్లో వేలం ముగిసింది. వేలం వేయడానికి సమయం సరిపోకపోవడంతో వ్యాపారులు ఒకే నాణ్యతతో ఉన్న ఉల్లి కుప్పలను చూసి.. వాటికి ధరలు నిర్ణయించి కొనుగోలు చేశారు. అయితే కొందరు వ్యాపారులు రైతులతో నేరుగా కొనుగోలు చేసి అమ్మకాలు సాగించారు. మార్కెట్‌కు వినియోగదారులు పోటెత్తడంతో వ్యాపారం జోరుగా సాగింది. ఉల్లిని ఏడాదిపాటు నిల్వ చేసుకునే అవకాశం ఉండటం వల్ల వినియోగదారులు బస్తాలుగా ఉల్లిని కొనుగోలు చేశారు.
భారీగా తరలింపు..
ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు భారీగా ఉల్లిని కొనుగోలు చేశారు. అక్కడే వాహనాల్లో నింపి తమ ప్రాంతాలకు తరలించారు. ఇక మహబూబ్‌నగర్ నుంచి చిరు వ్యాపారులు బొలెరో, ట్రాలీ ఆటోల ద్వారా తెచ్చి పెద్దఎత్తున ఉల్లిని కొనుగోలు చేశారు. దేవరకద్ర మార్కెట్ ఉదయం నుంచి సాయంత్రం వరకు సందడిగా కనిపించింది.
ఉమ్మడి జిల్లాకు కేంద్ర బిందువుగా దేవరకద్ర మార్కెట్
జిల్లా నలుమూలల నుంచి
తరలివస్తున్న వ్యాపారులు
వాహనాల్లో భారీగా ఉల్లి తరలింపు
సీజన్‌లో ప్రతి వారం వస్తాం..
ఉల్లి సీజన్‌లో ప్రతి వారం దేవరకద్ర మార్కెట్‌కు వస్తా. ఇక్కడ ఉల్లి నాణ్యతగా లభిస్తుంది. ఉమ్మడి జిల్లాలో ఉల్లి వ్యాపారానికి దేవరకద్రనే నంబర్ వన్ మార్కెట్. ఇక్కడి నుంచి క్వింటాల్ ఉల్లిని తరలించడానికి రూ. 350 వరకు ఖర్చు అవుతుంది. వేలంలో కొనుగోలు చేసిన ఉల్లిని వాహనాల్లో నేరుగా తరలిస్తాం.
– పర్వతాలు, ఉల్లి వ్యాపారి, అచ్చంపేట
మహారాష్ట్ర, కర్ణాటక వెళ్తాం..
దేవరకద్ర మార్కెట్‌లో ఉల్లి దొరకని రోజుల్లో మహారాష్ట్ర, కర్ణాటక వెళ్లి కొనుగోలు చేస్తాం. ఇక్కడ సీజన్‌లో ఎక్కువగా, అన్ సీజన్‌లో తక్కువగా ఉంటుంది. ఇక్కడ ధరలు పెరిగినప్పుడు వేరే రాష్ట్రాల్లో తక్కువగా ఉంటాయి. అప్పుడు అక్కడి నుంచి ఉల్లిని తెచ్చుకుంటాం.
– వెంకటేశ్, ఉల్లి వ్యాపారి, నాగర్‌కర్నూల్
ఇక్కడి వ్యాపారులు సహకరిస్తారు..
ప్రతి వారం ఉల్లిని కొనడానికి దేవరకద్ర మార్కెట్‌కు వస్తా. ఇక్కడి వ్యాపారులు కూడా బయటనుంచి వచ్చిన వ్యాపారులకు సహకరిస్తారు. పని ఒత్తిడితో వేలానికి రాని వారికి ఇక్కడి వ్యాపారులే కొనుగోలు చేసి వాహనాల్లో పంపిస్తారు. ఉల్లి కావాలంటే బుధవారం దేవరకద్రకు వెళ్తే దొరుకుతుందని వ్యాపారులందరూ నమ్మే పరిస్థితి ఉంది.
– చుక్కయ్య,
ఉల్లి వ్యాపారి, జడ్చర్ల
అందుబాటులో మార్కెట్..
దేవరకద్ర మార్కెట్ అన్నివిధాలా అందుబాటులో ఉంది. ఇక్కడ కొనుగోలు చేసిన ఉల్లి రవాణాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇక బయట మార్కెట్‌లో వచ్చిన ధరలను బేరీజు వేసుకుని ఇక్కడి వ్యాపారులు ఉల్లిని కొనుగోలు చేయడానికి అవకాశం కల్పిస్తారు. దీనివల్ల బయట నుంచి వచ్చే వ్యాపారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బహిరంగ వేలంలో ఉల్లిని కొనడానికి వీలు కలుగుతుంది.
– విశ్వనాథం, ఉల్లి వ్యాపారి, జడ్చర్ల

జోరుగా ఉల్లి వ్యాపారం

జోరుగా ఉల్లి వ్యాపారం

జోరుగా ఉల్లి వ్యాపారం

జోరుగా ఉల్లి వ్యాపారం

జోరుగా ఉల్లి వ్యాపారం