అచ్చంపేట: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగంలో 28వ రోజు శుక్రవారం సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టినా ఏడుగురు కార్మికుల జాడ లభించలేదు. సహాయక చర్యలకు ఆటంకంగా ఉన్న టీబీఎం యంత్రాన్ని దక్షిణ మధ్య రైల్వే సిబ్బంది అల్ట్రా థర్మల్ కట్టర్స్‌తో తొలగిస్తున్నారు. తవ్వకాలకు అడ్డుగా వస్తున్న బండరాళ్లును ఇటాచీలతో తొలగించి లోకో రైలులో బయటకు తరలిస్తున్నారు. నీటి ఊట, బురదను వాటర్ జెట్‌తో, మట్టిని కన్వేయర్ బెల్టుపై తరలించే ప్రక్రియ కొనసాగుతుంది. కార్మికుల ఆచూకీ కోసం డి–1 పాయింట్ వద్ద తవ్వకాలు కొనసాగిస్తున్నారు.
అందుబాటులోకి రాని రోబోల సేవలు..
40 మీటర్ల అత్యంత ప్రమాద ప్రదేశంలో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టేందుకు ఈ నెల 11న రోబోలు సొరంగం వద్దకు చేరుకున్నా.. ఇప్పటి వరకు వాటి సేవలు అందుబాటులోకి రాలేదు. పదిరోజులు దాటినా ఇంతవరకు సొరంగం లోపలికి వెళ్లలేదు. సొరంగంలో హైడ్రాలిక్ రోబో పనిచేయాలంటే టీబీఎం శకలాలు పూర్తిగా తొలగించాల్సి ఉంది. హైడ్రాలిక్ వ్యవస్థతో పనిచేసే రోబో ముందు భాగంలో ఉన్న గ్రైండర్ పెద్దపెద్ద రాళ్లు, శిథిలాలను ముక్కులుగా చేయడంతో పాటు బురదను వాక్యూమ్ పంపు సాయంతో నేరుగా కన్వేయర్ బెల్టుపై వేస్తోంది. అయితే టీబీఎం భాగాలు (ఇనుపరాడ్లు) అడ్డు రావడంతో రోబో సేవలకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది.
టీబీఎం భాగాలు తొలగిస్తున్నారు..
సొరంగంలోని డి–1, డి–2 ప్రదేశాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. శుక్రవారం ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘనాథ్, ఆర్మీ కల్నల్ పరీక్షిత్ మెహ్రా, వికాస్‌సింగ్, ఎన్డీఆర్‌ఎఫ్ అధికారి డా. హరీశ్, సింగరేణి రెస్క్యూ జీఎం బైద్యతో సొరంగంలో కొనసాగతున్న సహాయక చర్యల పురోగతి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. రోజువారీగా టీబీఎం భాగాలు కత్తిరించి బయటకు పంపిస్తున్నామని.. నీటి ఊటను డీవాటరింగ్ చేస్తూ సహాయక చర్యలు ముమ్మరం చేశామన్నారు. అధునాతన యంత్రాలతో నిరంతరాయంగా ఈ ప్రక్రియ కొనసాగిస్తున్నామని, ఉన్నతాధికారులు సహాయక బృందాల సేవలను పర్యవేక్షిస్తూ చర్యలను వేగవంతం చేస్తున్నట్లు చెప్పారు.
28వ రోజుకు చేరిన సహాయక చర్యలు
కార్మికుల జాడ కోసం ప్రయత్నిస్తున్న అధికారులు
ఎస్‌ఎల్‌బీసీలో కొనసాగుతున్న అన్వేషణ