మహబూబ్‌నగర్ రూరల్: మహబూబ్‌నగర్ అర్బన్ మండలం ఏనుగొండ రెవెన్యూ వార్డు సమీపంలోని మౌలాలిగుట్ట వద్ద కొరంగడ్డ కుంటను ధ్వంసం చేసిన సంఘటనపై శుక్రవారం అధికారులు స్పందించారు. ఇరిగేషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మనోహర్, ఏఈ ఆసీఫ్, రెవెన్యూ గిర్దావర్ నర్సింగ్ తమ సిబ్బందితో మొఖపైకి వెళ్లి విచారణ జరిపారు. కొరంగడ్డ కుంట పరిసర ప్రాంతం 403 సర్వేనంబర్‌లో పది ఎకరాలకు పైగా విస్తరించి ఉంది. రెవెన్యూ రికార్డుల పరంగా ఈ కుంట ప్రాంతం పట్టాదారులది అయినప్పటికినీ.. ఎలాంటి అనుమతులు లేకుండా కుంటను ధ్వంసం చేయడంతో పాటు సుమారు వంద మీటర్ల కట్టను జేసీబీలతో తొలగించారు. ఈ సంఘటన జరిగాక అధికారులు మొఖపైకి వెళ్లారు. అక్కడ జరిగిన విధ్వంసాన్ని చూసిన అధికారులు పరిసర ప్రాంత రైతులతో మాట్లాడి విచారించారు. కుంటను పూర్తిగా ధ్వంసం చేసిన సంఘటనపై అందుకు బాధ్యులైన పట్టాదారులపైనే ముందస్తుగా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తామని డీఈ మనోహర్ వెల్లడించారు. ఇదిలా ఉండగా హైదరాబాద్– రాయచూర్ ప్రధాన రహదారికి సమీపంలో గల మౌలాలిగుట్ట వద్ద ఈ కుంట భూమి ఎంతో విలువైనది. దీంతో కన్నెసిన రియల్టర్లు పట్టాదారులతో కుమ్మకై ్క వెంచర్ వేసేందుకు ఏకంగా కుంట కట్టను పూడ్చివేశారు. అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు కీలక పాత్ర వహించడంతో ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు తలలు పట్టుకుంటున్నారు.