మహబూబ్‌నగర్ న్యూటౌన్: తాగు, సాగునీటి అవసరాలకు గ్రామాలకు తలమానికంగా ఉన్న చెరువులను తోడేస్తున్నారు. గత సీజన్‌లో వర్షాలు భారీగా కురిసి.. చెరువులు, కుంటలు అలుగులు పారడంతో మత్స్యకారులు సంతోషపపడ్డారు. కానీ ఎండల తీవ్రత వల్ల చెరువుల్లోని నీరు అడుగంటిపోవడం మత్స్య సంపద వృద్ధిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. రోజురోజుకు భూగర్భజలాలు తగ్గడం వల్ల చేపల ఉత్పత్తికి ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. దీనికి తోడు చెరువుల్లో మిగిలిన కొద్దిపాటి నీటిని సైతం మోటార్లు బిగించి తరలించడం వల్ల చేపల మనుగడకు, జంతువులు, పక్షుల తాగునీటి అవసరాలకు సైతం ముప్పు వాటిల్లుతోంది. నీటిని తోడవద్దని గ్రామాల్లోని మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు చెబుతున్నా.. పట్టించుకోకుండా గొడవలకు దిగడం, ఒకరిపై ఒకరు పోలీసుస్టేషన్లలో ఫిర్యాదులు చేసుకునే వర కు వెళ్లింది. ఇటీవల హన్వాడ మండలం వేపూరు, పెద్దదర్పల్లి, కొత్తపేట, బుద్దారంతో పాటు గండేడ్, మహమ్మదాబాద్ మండలాల్లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. చెరువు తూము నుంచి వెనుక ఉన్న పంటలకు నీరు వదలాలనే నిబంధనను ఖాతరు చేయకుండా మోటార్లు బిగించి నీటిని తరలించడంపై మత్స్య సహకార సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అధికారులకు ఫిర్యా దులు చేసినా స్థానిక పరిస్థితుల నేపథ్యంలో నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. చెరువుల్లో మోటార్లు బిగించి నీటిని తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకొని నివారించాలని, భవిష్యత్‌లో ఎవరూ చెరువులో మోటార్లు బిగించకుండా అధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారు.
ఆయకట్టు సంఘాలు లేకపోవడం వల్లే..
గ్రామాల్లో చెరువులకు సంబంధించి గతంలో ఆయకట్టు సంఘాలు ఉండేవి. గత ప్రభుత్వం హయాంలో వాటిని రద్దు చేయడంతో ఆయకట్టు సమస్యలు తీవ్రం కావడంతో పాటు చెరువులపై ఎవరికీ అజమాయిషీ లేని కారణంగా పలు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. చెరువులో నీటి నిల్వ ఆధారంగా పంటల సాగు, ఆయకట్టు కాల్వల మరమ్మతు, చెరువు మరమ్మతు పనులు వంటి వాటిపై ఆయకట్టు సంఘాల చొరవ ఉండేది. ప్రస్తుతం చెరువులపై ప్రాతినిధ్యం ఎవరికీ లేకపోవడంతో ఆయకట్టు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. గతంలో ఆయకట్టు సంఘాలు, మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు కలిసి చర్చించుకొని ఆయకట్టు సాగుకు నీటి వాడకం, చేపల పెంపకానికి, పశుపక్షాదుల తాగునీటి అవసరాలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకునేవారు. అలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి పాలకవర్గాలు లేకపోవడం సమస్యలకు దారితీస్తోంది.
గతేడాది చెరువుల్లో వదిలిన చేప పిల్లలు
88 లక్షలు
మోటార్లు బిగించడానికి లేదు..
చెరువుల్లో మోటార్లు పెట్టి నీటిని తరలించడానికి లేదు. చెరువు తూము నుంచి మాత్రమే వదలాలి. మిగతా నీరు చెరువులో ఉంటే పశుపక్షాదుల తాగునీటి అవసరాలతో పాటు బోర్లు రీచార్జి అయ్యేందుకు ఉపయోగపడుతుంది. మోటార్లు పెట్టి నీటిని తరలించినట్లు ఎవరైనా తమ దృష్టికి తెస్తే చర్యలు తీసుకుంటాం. – మనోహర్,
చిన్ననీటి పారుదల శాఖ డిప్యూటీ ఈఈ
చెరువుల్లో అడుగంటుతున్న నీటి వనరులు
మోటార్లతో ఉన్న నీటిని సైతంతోడేస్తున్న వైనం
ఫిర్యాదు చేసినా.. నిస్సహాయత వ్యక్తం చేస్తున్న అధికారుల
ప్రశ్నార్థకంగా మత్స్య, పశు సంపద అభివృద్ధి
సహకారం లేని
పారిశ్రామిక సహకార సంఘాలు
సభ్యత్వం ఉన్న వారు
12,300
మంది
మత్స్య పారిశ్రామికసహకార సంఘాలు
225
జిల్లాలో మొత్తం చెరువులు, కుంటలు
1,091