పాలమూరు: జిల్లాలో శుక్రవారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే పరీక్షల ముందు కొంత మంది విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవడం, త్వరగా అలిసిపోవడం వంటివి జరుతుంటాయి. ముందుగా మానసిక ఒత్తిడి నుంచి బయటపడాలని, ఆ సమయంలో ఆరోగ్యంగా ఉండేలా ఆహారంపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని జనరల్ ఆస్పత్రి న్యూట్రిషనిస్ట్ శైలజ చెబుతున్నారు. వివరాలు ఆమె మాటల్లోనే..
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే..
విద్యార్థులు వేళకు భోజనం చేయాలి. ఉదయం త్వరగా జీర్ణమయ్యే అల్పాహారం, మధ్యాహ్నం సంప్రదాయ భోజనం మితంగా మాత్రమే తీసుకోవాలి. మాంసాహారం, నూనెలు ఎక్కువగా ఉండే పదార్థాల జోలికి వెళ్లొద్దు. రాత్రి సైతం ఇదే విధంగా నిద్రపోవడానికి కనీసం రెండు గంటల ముందు భోజనం చేయాలి. ఉదయం సకాలంలో నిద్రలేస్తే రోజు మొత్తం చురుకుగా ఉంటారు.
పరీక్ష రోజు ఎలా?
ఉదయం అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా, పాలు, పండ్లు ఉండేలా చూసుకోవాలి. మధ్యాహ్నం అన్నం, రొట్టె, కూరగాయాలు, ఆకుకూరలు, పెరుగు, సాంబార్ వంటివి తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. రాత్రి అన్నం లేదా చపాతి పప్పు వంటివి తక్కువ మోతాదులో తీసుకోవాలి.
భోజనంలో వేటికి ప్రాధాన్యం
సమతుల ఆహారానికి ప్రాధాన్యమివ్వాలి. భోజనంలో పోషకాలు, కార్బోహైడ్రేట్లు ఉండేలా చూసుకోవాలి. ఇందుకు పప్పుధాన్యాలు, చపాతి, అన్నం, కూరగాయలు వంటివి తీసుకోవాలి. తక్కువ మోతాదు ఉన్న నూనె పదార్థాలు మాత్రమే తీసుకోవాలి. కాలానుగుణ పండ్లు తీసుకుంటే ఏకాగ్రత పెరుగుతుంది. అతిగా భోజనం చేస్తే ఆరోగ్యం సమస్యతో పరీక్షలపై ప్రభావం చూపుతుంది. నీళ్లు ఎక్కువగా తాగాలి. అల్పాహారంలోనూ తేలికపాటి ఆహారం ఉంటే మంచిది. రోజూ ఉదయం డ్రైప్రూట్స్ తీసుకుంటే అలసట నుంచి ఉపశమనం పొందవచ్చు.
నూనె వస్తువులు, కూల్‌డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి
రాత్రివేళ అతిగా భోజనం ప్రమాదం
ప్రతిరోజూ నిర్ణీత సమయంలోనే నిద్ర మంచిది
కాలానుగుణ పండ్లతో ఏకాగ్రత పెంపు
‘సాక్షి’తో జనరల్ ఆస్పత్రి న్యూట్రిషనిస్ట్ శైలజ
ఆహారానికి, నిద్రకు సంబంధం
సాధారణంగా రాత్రివేళలో అతిగా భోజనం చేస్తే నిద్రపట్టదు. ఈ సమయంలో వేపుళ్లు, చిప్స్, తీపి పదార్థాలు, చాక్లెట్లు తినకూడదు. కాఫీ, టీ, కూల్‌డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి. వీటి వల్ల నిద్రలేమికి గురయ్యే ప్రమాదం ఉంది. తిన్న వెంటనే పుస్తకం పట్టుకుంటే నిద్ర ముంచుకొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనీసం 10 నుంచి 15 నిమిషాల పాటు వాక్ చేయడం మంచిది. ప్రతిరోజు ఒకే నిర్ణీత సమయంలోనే నిద్రపోవాలి. కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోతే పడుకునే ముందు తీసుకున్న ఆహారం సైతం సక్రమంగా జీర్ణమై ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉంటారు.