మహబూబ్‌నగర్ రూరల్: ఓ వైపు జల వనరుల సంరక్షణకు ప్రభుత్వం రూ.కోట్లాది ఖర్చు చేస్తుంటే.. మరోవైపు అధికారుల అలసత్వం.. స్థానిక నేతల అండదండలు వెరసి దశాబ్దాలుగా భూగర్భ జలాల పెంపునకు తోడ్పాటుగా ఉంటున్న చిన్న నీటి వనరులను మాయమైపోతున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం పట్టింపులేని తనం కారణంగా కొరంగడ్డ కుంట కబ్జాకు గురవుతోంది. మహబూబ్‌నగర్ అర్బన్ మండలం ఏనుగొండ రెవెన్యూ వార్డు మౌలాలిగుట్ట సమీపంలో కొరంగడ్డ కుంట దశాబ్దాల క్రితం నిర్మించారు. చుట్టుపక్కల భూగర్భజలాల పెంపునకు ఇది ఎంతో దోహదం చేస్తుంది. ఈ ప్రాంతంలో భూమి విలువ ఎక్కువగా ఉండడంతో స్థిరాస్తి వ్యాపారుల దృష్టి ఈ కుంటపై పడింది. శిఖం భూమి అయినప్పటికీ కుంట కొందరి రైతుల పట్టా భూమిలో ఉంది. అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు నిబంధనలు ఉల్లంఘించి కుంటను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కొన్ని రోజులుగా గుట్టుగా కుంట భూమిని పూడ్చేసే పనిలో ఉన్నారు. ఈ విషయం కొందరు చిన్ననీటి పారుదల శాఖ అధికారుల దృష్టికి వెళ్లడంతో.. వారు గురువారం అక్కడి చేరుకొని కుంట పూడ్చివేత పనులను నిలిపి వేయించారు. అధికారి పార్టీ నాయకుడి ఆగడాలను అడ్డుకొని కుంటను కాపాడాలని స్థానిక రైతులు అధికారులను కోరారు.
సర్వే చేసేందుకు మీనమేషాలు..
మహబూబ్‌నగర్ అర్బన్ మండలంలో కుంటలు కబ్జాకు గురవుతున్నాయని, వాటిని సర్వే చేసి పక్కాగా హద్దులు ఏర్పాటు చేయాలని రైతులు, ప్రజలు వేడుకుంటున్నా ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల్లో చలనం లేదు. వాస్తవానికి ప్రతి జల వనరు శిఖం తర్వాత ఎఫ్‌టీఎల్ పరిధి, దానిపైన బఫర్ జోన్ ఉంటుంది. సొంత పట్టా భూములు ఉన్నా వాటిల్లో ఎలాంటి నిర్మాణాలు చేయడానికి వీల్లేదు. అయినా స్థిరాస్తి వ్యాపారులు ఇష్టారాజ్యంగా ఎఫ్‌టీఎల్ పరిధిలో మట్టి పోసి వెంచర్లు చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు.
పోలీసులకు ఫిర్యాదు చేస్తాం
ఏనుగొండ రెవెన్యూ శివారులో కొరంగడ్డకుంట పూడ్చే వేసే ప్రయత్నిస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఆ కుంట పట్టా పొలంలో ఉంది. అయినా కుంటను పూడ్చేందుకు వీల్లేదు. రెవెన్యూ అధికారులతో సర్వే చేయించి.. పట్టాదారులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేస్తాం.
– మనోహర్, డీఈ, చిన్ననీటిపారుదలశాఖ
కొరంగడ్డకుంటను పూడ్చేందుకుఓ నాయకుడి యత్నం
అడ్డుకున్న చిన్ననీటి పారుదల శాఖ అధికారులు
కుంటను మింగేస్తున్నారు!