వనపర్తి: తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని పట్టుకున్నట్లు వనపర్తి ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. జిల్లాకేంద్రంలోని ప్యాటగడ్డవీధికి చెందిన జలగరి ముత్తు, గాంధీనగర్‌కు చెందిన దుల్లోల రాజు తాగుడు, జల్సాలు, కోటి పందేలు తదితర వ్యసనాలకు అలవాటు పడి గతంలో గొర్రెల దొంగతనం చేయడంతో పాన్‌గల్ పోలీసులు పట్టుకొని జైలుకు తరలించారు. జైలులో వారికి జడ్చర్లకు చెందిన మూర్తి పరిచయమై తాళం వేసిన ఇళ్లలో దొంగతనం చేస్తే బంగారం, వెండి, నగదు దొరుకుతాయని.. బంగారం, వెండి విక్రయిస్తే డబ్బులు బాగా వస్తాయని తెలిపాడు. అతడి మాటలతో జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పగటిపూట తాళం వేసి ఉన్న ఇళ్లపై రెక్కి నిర్వహించి రాత్రిళ్లు చొరబడి ఇంటి, బీరువా తాళాలు పగులగొట్టి బంగారం, వెండి, నగదు ఎత్తుకెళ్లడం ప్రారంభించారు. బుధవారం జిల్లాకేంద్రంలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు వీరిద్దరూ అనుమానాస్పదంగా కనిపించడంతో పట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించి తమదైన శైలిలో విచారించారు. దీంతో వివిధ పోలీస్‌స్టేషన్ల పరిధిలో చేసిన నేరాలను ఒప్పుకున్నారు. వీరి నుంచి 5 తులాల బంగారం, రూ.3 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ తెలిపారు. డీఎస్పీ వెంకటేశ్వర్‌రావు, సీఐ కృష్ణ, పట్టణ ఎస్‌ఐ హరిప్రసాద్, ఎస్‌ఐలు జలంధర్‌రెడ్డి, జగన్, రాణి, జయన్న, రామరాజు, ఏఎస్‌ఐ తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.
బంగారం, రూ.3 లక్షల నగదు స్వాధీనం
వివరాలు వెల్లడించిన వనపర్తి ఎస్పీ రావుల గిరిధర్